ఎన్నికల నేపథ్యంలో సమస్యలపై చర్చోపచర్చలు

– జల వివాదాలే ప్రధానం
– జాడలేని అపెక్స్‌ కౌన్సిల్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
సాధారణ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో రాజ కీయ పార్టీలు, నేతలు ప్రజాసమస్యలపై వాడీవేడీ విమర్శలకు దిగుతున్నారు. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ఒకరిపై మరొకరు రాజకీయ దాడికి దిగుతున్నారు. సుమారు రెండు నెలల్లో ఎన్ని కలు రానున్న కారణంగా విమర్శలు, అరోపణల తీవ్ర త పెరుగుతూ వస్తున్నది.ఇటు ప్రభుత్వ యంత్రాం గం సైతం హడావిడి చేస్తున్నది. కేంద్రంపై ఒత్తిడి చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతున్నది. ఇదే సందనుకుని ఢిల్లీలో మోడీ సర్కారు తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా పావులు కదుపుతు న్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీలున్న చోట్ల మరోరకంగా వ్యవ హరిస్తున్నది. పునర్వీభజన సమస్యలతోపాటు జాతీ య హోదాతో కూడిన సాగునీటి ప్రాజెక్టు, జాతీయ రహదారులు, ఇతర సమస్యల విషయంలో పక్షపాత ధోరణిని అనుసరిస్తున్నది. దీంతో ఇబ్బందులు తప్ప డం లేదు. సాగునీటి సమస్యలైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. ఉన్నతస్థాయి సమావేశాలు సరిగ్గా జరగక పోవడం, ఆ మేరకు ముఖ్యమంత్రుల స్థాయిలో చొరవ తక్కువగా ఉండ టం కీలకమైన సమస్యలు పెండింగ్‌లో ఉండటానికి కారణమవు తున్నది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పేర తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై పెత్తనం చేస్తున్న మోడీ సర్కార్‌, ఆయా సమస్యల పరిష్కారా నికి మాత్రం శ్రద్దపెట్టడం లేదు. రాజకీయ ప్రయో జనాలను అడ్డం పెట్టుకుని చదరంగమాడుతున్నది. అవసరాన్ని బట్టి జరగాలిసన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి ఏడాది జరగలేదనే చెప్పాలి. చొరవతీసుకోవాల్సిన కేంద్ర జలశక్తి మంత్రి త్వశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా కృష్ణా జలాల పున: పంపిణీ, ఇతర సమస్యల పరిష్కారానికి దృష్టిసారిం చాల్సిన అవసరం కనిపిస్తున్నది.
అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి లో ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు ఇటీవల మరో సారి చర్చనీయాంశమవుతున్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక అభ్యంతరాలు, అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 2020, అక్టోబరు ఆరున అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి జరిగిన విషయం విదితమే. ఆ భేటిలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రు లు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యా రు. ఇప్పటివరకు రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత జరిగిన మూడో కౌన్సిల్‌ జరుగుతాయని అందరూ భావించారు. అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్ర ప్రాజెక్టులు లేని కారణ ంగా జీఆర్‌ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ చెబుతుండగా, దాదాపు నిర్మాణం పూర్తయిన కాళే శ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ సర్కారు అంటున్నది . కృష్ణానదీ పరిధిలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్‌ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అదిప్పు డు మరింత తీవ్రమైంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యూనల్‌(కేడబ్ల్యూడీటీ-2) ప్రకారం నదీ జలాల పున:పంపిణీ జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నది. కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా 75 శాతం ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు ఇవాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులు పున:పంపిణీ చేయాలని కోరినా కేఆర్‌ఎంబీ స్పందించడం లేదనీ, గతంలో మాదిరి గానే 299 టీఎంసీలనే కేటాయిస్తున్నదని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో అంతరాష్ట్ర జల వివాదా ల చట్టం-1956లోని సెక్షన్‌ 3 ప్రకారం ఏపీ, తెలం గాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, ప్రధానం గా కృష్ణా నదీ నీటి పంపిణీకి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. కాగా ఆ ప్రతి పాదనను కేంద్రం తిరస్కరించింది.కృష్ణా జలాల వివా దాల అంశాలతోపాటు గోదావరి నదీపై నిర్మి స్తున్న ఆరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు అనుమతు లు కోరగా నాలుగింటికి గత నెలలో మంజూరు చేసిం ది. పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతు లు సైతం వచ్చాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పునర్వీభజన చట్టంలోని సమస్యలు, జల వివాదా లపై మరింత లోతుగా చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదు.