– కేరళ గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– కేరళలో ప్రారంభమైన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూడు రోజుల పాటు జరిగే సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు కేరళ తిరువనంతపురంలోని ఈఎంఎస్ అకాడమీలో ఆదివారం ప్రారంభమయ్యాయి. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో.. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజకీయ నివేదికను ప్రవేశపెట్టారు. సమావేశాల సందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కేంద్ర కమిటీ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికలు, బీహార్ పరిస్థితులు, ఇండియా ఫోరం గురించి కూడా చర్చిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయనీ, పెద్దగా ఇబ్బందులులేమీ ఉండవని భావిస్తున్నట్టు తెలిపారు. కేరళ గవర్నర్ అప్రజాస్వామిక వైఖరి అవలంబిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రజల సమస్యలకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయకుండా నిలుపుదల చేశారని అన్నారు. దీనికి సంబంధించి కోర్టు అఫిడవిట్ కోరగా.. ఒక బిల్లుపై సంతకం చేసి మిగిలిన బిల్లులపై రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు.