న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ), హత్య కేసులో ఏ9గా ఉన్న ఎం.వి. కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకు ఉన్నట్టు ఆదేశాలు ఇవ్వాలన్న కృష్ణారెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజరు కుమార్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని ధర్మాసనం స్వతంత్రత కల్పించింది.