ఇబ్బందులు కలగకుండా చేప ప్రసాదం పంపిణీ

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– జూన్‌ 9న పంపిణీ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకూ గురికాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జూన్‌ 9వ తేదీన నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వివిధ శాఖల అధికారులు, చేప ప్రసాదం పంపిణీ చేయనున్న బత్తిన హరినాథ్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు, పలు స్వచ్చంద సంస్థల నిర్వాహకులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బత్తిన హరినాథ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు వంశ పారంపర్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ వస్తున్నదని చెప్పారు. కరోనా కారణంగా మూడు సంవత్సరాల తర్వాత తిరిగి ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. చేప ప్రసాదం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి లక్షలాది మంది వస్తుంటారన్నారు. బత్తిన సోదరుల నివాసం నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు పోలీస్‌ ఎస్కార్ట్‌తో ప్రసాదం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వమే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తుందని తెలిపారు. ప్రజలు లైన్‌లో వెళ్లే విధంగా బారికేడ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లను అందుబాటులో ఉంచుతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్‌ క్యాంప్‌లు, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఒకటి, రెండు రోజులు ముందే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు ప్రజలు చేరుకునే అవకాశం ఉందని.. వారికి జైశ్వాల్‌ సమాజ్‌, అగర్వాల్‌ సమాజ్‌, శ్రీకృష్ణ కమిటీ, బద్రి విశాల్‌ పిట్టి వంటి పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో అల్పాహారం, భోజనం అందించే ఏర్పాట్లు చేస్తారని, వారికి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రహమతుల్లా బేగ్‌, కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటి, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, వాటర్‌వర్క్స్‌ డైరెక్టర్‌ కృష్ణ, సీజీఎంప్రభు, జీఎం షరీఫ్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఆబిడ్స్‌ ఏసీపీ పూర్ణచందర్‌రావు, ట్రాఫిక్‌ డీసీపీ అశోక్‌ కుమార్‌, ఏసీపీ కోటేశ్వర్‌రావు, ట్రాన్స్‌కో సీజీఎం నరసింహ స్వామీ తదితరులు పాల్గొన్నారు.