కేరళలో పింఛన్ల పంపిణీ ప్రారంభం

 Pensions in Kerala Distribution start– ఓనం సందర్భంగా 60 లక్షల మందికి అందజేత
తిరువనంతపురం : ఓనం సందర్భంగా లబ్ధిదారులందరికీ రెండు నెలల సంక్షేమ పింఛను పంపిణీని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ప్రారంభించారు. సామాజిక భద్రతా పింఛనుకు రూ.1,550 కోట్లు, సంక్షేమ బోర్డు పింఛనుకు రూ.212 కోట్లు కలిపి రూ.1,762 కోట్లు కేటాయించినట్టు సీఎం తెలిపారు. సుమారు 60 లక్షల మందికి రూ.3,200 చొప్పున పింఛన్ల పంపిణీ ఈ నెల 23 నాటికి పూర్తి చేయనున్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటింది. అప్పటి నుంచి ఓనం సందర్భంగా ఒకేసారి రెండు నెలల పంపిణీ కొనసాగుతోంది.
పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్‌ఎంఎస్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆర్థిక సహాయ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్న కేంద్రం నిబంధనలను కేరళ రాష్ట్రం అమలు చేస్తోంది. అయినప్పటికీ కేంద్రం వాటాగా లబ్ధిదారులకు అందాల్సిన రూ.580 కోట్ల సహాయం రాష్ట్రానికి అందలేదు. మొత్తం 60 లక్షల మంది లబ్ధిదారులలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) ద్వారా 6,88,329 మందికి కేంద్ర సాయం అందాల్సి ఉంది. కేంద్రం వాటా అందనప్పటికీ 2021 జనవరి నుంచి ఎన్‌ఎస్‌ఎపి లబ్ధిదారులతో సహా అర్హులైన సామాజిక భద్రత పెన్షన్‌ లబ్ధిదారులందరికీ రాష్ట్రప్రభుత్వం పూర్తి మొత్తాన్ని చెల్లిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం రాజీ లేకుండా నిలబెట్టుకుంటోందని సిఎం విజయన్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.