– మతానికి రాజకీయాన్ని జోడిస్తున్న బీజేపీ
– మణిపూర్ మారణహోమంతో దేశ సమగ్రతకు ముప్పు
– నూతన విద్యావిధానంతో చరిత్రను రూపుమాపే యత్నం
– సనాతన ధర్మాన్ని పక్కనబెడితేనే అభివృద్ధి
– ఏపీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, న్యాయ సలహాదారు జూపూడి
– మణిపూర్ మారణకాండ- దేశ రాజకీయ ముఖచిత్రంపై డీవైఎఫ్‌ఐ సదస్సు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మతతత్వం దేశ విభజనకు దారితీస్తుందని.. 1947లో భారతదేశం ముక్కలు కావడానికి ఇదే కారణమని ఆంద్రపద్రేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. మణిపూర్ మారణహోమంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. డీవైఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్‌లో శనివారం నిర్వహించిన ‘మణిపూర్ మారణకాండ- దేశ రాజకీయ ముఖచిత్రం’పై సదస్సులో లక్ష్మణరావు మాట్లాడారు. మతానికి రాజకీయాన్ని జోడించి హిందూత్వం పేరుతో బీజేపీ ముందుకు పోతోందని విమర్శించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే విధానం, ఒకే మతం అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాజ్యాంగ మూలసూత్రాలపై దాడులు చేస్తోందన్నారు. మణిపూర్ మారణహోమంతో దేశ సమగ్రతకు మోడీ ముప్పు తెచ్చారన్నారు. నూతన విద్యావిధానం ద్వారా చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ముస్లిం ప్రముఖులు, రాజుల చరిత్రను లేకుండా పాఠ్యాంశాలు రూపొందిస్తోందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మొఘల్ చక్రవర్తుల పాఠ్యాంశాలను చరిత్ర పుస్తకాల్లో నుంచి తొలగించినట్లు చెప్పారు. మనం అప్రమత్తంగా లేకపోతే మణిపూర్ మారణకాండ తూర్పు ప్రాంతానికే కాదు.. దేశం మొత్తానికి వ్యాపిస్తుందని ఏపీ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. మణిపూర్ మంటలపై 40రోజుల తర్వాత పెదవి విప్పిన మోడీ విపక్ష పాలిత రాష్ట్రాలపై నాలుగు రాళ్లు వేశారేకానీ మణిపూర్ ఘటన గురించి ప్రస్తావించకపోవడం దారుణం అన్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను జూపూడి సమర్థించారు. సనాతన ధర్మాన్ని పక్కన పెడితేనే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుందని చెప్పారు.
సీఏఏతో ముస్లింలకే కాదు ఆదివాసీలకూ నష్టమేనని ప్రముఖ జర్నలిస్టు పీవీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీ నమ్మే శాస్త్రం ప్రకారం ఈశాన్యంలో మంట పెట్టకూడదంటారు.. కానీ కేంద్రం ఈశాన్యంలోని మణిపూర్‌లో మంటలు పెట్టిందని రైతుసంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. మోడీ మంటలపై అప్రమత్తంగా లేకపోతే దేశమొత్తాన్ని తగులబెడతారన్నారు.
మణిపూర్ వాసులమే కాదు భారతీయులం..: కిమ్‌కోవా, డెలిగేట్ మేము మణిపూర్ వాసులమే కాదు ఈ దేశ పౌరులమని మణిపూర్ డెలిగేట్స్‌లో ఒకరైన కిమ్‌కోవా ఆవేదన వెలిబుచ్చారు. ‘మేము మణిపూర్ రాష్ట్రానికే కాదు భారతీయులం. సుభాష్‌చంద్రబోస్ పోరాట వారసులం. ఈరోజు నోరు, ఇండ్లు లేనివారిగా మిగిలిపోయాం. గొంతులేని మనుషులుగా మారిపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో యూసీఎస్‌వో వ్యవస్థాపక అధ్యక్షులు గుడిబండ్ల దీపక్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, రైతుసంఘం జిల్లా నాయకులు బండి రమేష్, యంగ్ ఉమన్ రాష్ట్ర కన్వీనర్ రోషినీఖాన్, ప్రముఖ విద్యావేత్తలు ఐవీ రమణారావు, రవి మారుత్, డీవైఎఫ్‌ఐ నాయకులు చింతల రమేష్, శీలం వీరబాబు, సత్తెనపల్లి నరేష్, భూక్యా ఉపేందర్‌నాయక్, కూరపాటి శ్రీను, కె.సుజాత, బట్టు రాజు, దిండు మంగపతి, బడ్డు మధు, గుమ్మ ముత్తారావు, కనపర్తి గిరి పాల్గొన్నారు.