– క్వార్టర్స్‌లో టేలర్‌పై గెలుపు
– యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
– న్యూయార్క్
సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకంలో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అత్యధిక సార్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్న ఆటగాడిగా స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును బద్దలు కొట్టాడు. 16 ఏండ్ల క్రితం 2007లో యు.ఎస్ ఓపెన్ వేదికగా కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న జకోవిచ్.. తాజాగా మెన్స్ సింగిల్స్‌లో టేలర్‌పై విజయంతో ఏకంగా 47వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రోజర్ ఫెదరర్ (46) రికార్డును బద్దలు కొట్టాడు. లోకల్ స్టార్ టేలర్ ఫ్రిట్జ్‌పై 6-1, 6-4, 6-4తో వరుస సెట్లలో విజయం సాధించిన నొవాక్ జకోవిచ్.. న్యూయా ర్క్‌లో మరో గ్రాండ్ విక్టరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
ఎదురులేని జకోవిచ్
మూడు సెట్లలోనే ముగిసిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో జకోవిచ్ ఏకపక్ష విజయం నమోదు చేశాడు. ఏడు ఏస్‌లు సంధించిన జకోవిచ్.. ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసినా అద్భుత విజయం అందుకున్నాడు. టేలర్ సర్వ్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసిన జకోవిచ్.. ప్రత్యర్థిని చిత్తు చేశాడు. జకోవిచ్ సర్వ్‌ను టేలర్ రెండు సార్లు బ్రేక్ చేసినా.. సెర్బియా స్టార్‌కు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాడు. పాయింట్ల పరంగా 102-81తో జకోవిచ్ పైచేయి సాధించాడు. టేలర్ 9 గేములు గెలుపొందగా.. జకోవిచ్ 18 గేములు గెల్చుకున్నాడు. స్వీయ సర్వ్‌లో టేలర్ 7 గేములు నెగ్గగా.. జకోవిచ్ ఏకంగా 12 గేములు సాధించాడు. పురుషుల సింగిల్స్ మరో క్వార్టర్‌ఫైనల్లో బెన్ షెల్టన్ విజయం సాధించాడు. ఆల్ అమెరికన్ల పోరులో బెల్ షెల్టన్ 6-2, 3-6, 7-6(9-7), 6-2తో నాలుగు సెట్ల మ్యాచ్‌లో సహచర ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫోపై విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో పదో సీడ్ కరోలినా ముచోవా వరుస సెట్లలో గెలుపొంది సెమీఫైనల్లోకి చేరుకుంది. చెక్ రిపబ్లిక్ స్టార్ ముచోవా 6-0, 6-3తో సోరాన సిరస్టీయ (రోమానియా)ను చిత్తు చేసింది. ఆరు ఏస్‌లు కొట్టిన ముచోవా.. ఆరు బ్రేక్ పాయింట్లతో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. పాయింట్ల పరంగా ముచోవ 73 సాధించగా.. సోరాన 49 పాయింట్లతో సరిపెట్టుకుంది.
మెరిసిన బోపన్న జోడీ
భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న మెన్స్ డబుల్స్‌లో సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియా భాగస్వామి మాథ్యూ ఎడెన్‌తో కలిసి యు.ఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పోటీపడుతున్న రోహన్ బోపన్న.. పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్లో ప్రవేశించాడు. క్వార్టర్‌ఫైనల్లో 7-6(12-10), 6-1తో 15వ సీడ్, అమెరికా జోడీ లామ్మోన్స్, జాక్సన్‌లపై మెరుపు విజయమ నమోదు చేశారు. నేడు సెమీఫైనల్లో ఫ్రాన్స్ జోడీ నికోలస్, హెర్బర్ట్‌లతో రోహన్ బోపన్న జోడీ తలపడనుంది.