అనవసరంగా అరెస్ట్‌ చేయొద్దు

Do not arrest unnecessarily– అది వారికి అవమానకరం
– వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరం పోలీసులకు
– సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: అనవసరంగా ఎవరినీ అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. కారణం లేకుండా అరెస్ట్‌ చేస్తే దానిని వారు అవమానకరంగా భావిస్తారని, అదీకాక వారి వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగకరమని తెలిపింది. అరెస్ట్‌ చేసే ముందు తమ ముందు హాజరు కావాల్సిందిగా నిందితుడికి నోటీసులు ఇచ్చే విషయంపై అర్నేష్‌ కుమార్‌కు, బీహార్‌ ప్రభుత్వానికి మధ్య నడిచిన కేసులో గతంలో న్యాయస్థానం ఏం చెప్పిందో దానిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. వివిధ నేరాలను విచారిస్తున్న క్రిమినల్‌ కోర్టులు, సెషన్స్‌ కోర్టులు పాటించాల్సిన మార్గదర్శకాలను నోటిఫికేషన్ల రూపంలో జారీ చేయాలని హైకోర్టుల ను ఆదేశించింది. జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
నిందితుడిని అరెస్ట్‌ చేసే ముందు అతనిని తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సెక్షన్‌ 41-ఏ ప్రకారం పోలీసులు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని 2014లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పులోని అంశాలనే పునరుద్ఘాటిస్తూ తాజాగా అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ‘అన్ని దిగువ కోర్టులకు, రాష్ట్రాలలోని పోలీస్‌ అధికారులకు ఎనిమిది వారాలలో మార్గదర్శకాలు, ఆదేశాలు, శాఖాపరమైన సర్క్యులర్లు జారీ చేయండి’ అని ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలుపై అన్ని రాష్ట్రాలు, హైకోర్టులు వాటి రిజిస్ట్రార్ల ద్వారా అఫిడ విట్లు దాఖలు చేయాలని నిర్దేశించింది. ఒక కేసులో పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ నిరాకరిస్తూ జార్ఖండ్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన అప్పీలు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడైన పిటిషనర్‌ విచారణకు సహకరిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.
ఏమిటీ కేసు?
పిటిషనర్‌ అయిన యువకుడిని 2020లో ఓ మహిళతో వివాహం జరిగింది. భార్య కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారంటూ పిటిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఆ మహిళ తన భర్త, అతని బంధువులపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పిటిషనర్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అయితే సెషన్స్‌ కోర్టులోనూ, ఆ తర్వాత హైకోర్టులోనూ అతనికి ముందస్తు బెయిల్‌ లభించలేదు. దీనిపై అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దిగువ కోర్టుల ఆదేశాలను సుప్రీం తప్పుపట్టింది.