వడ్లు కొనరా..?

– రోజులు గడుస్తున్నా.. కేంద్రాల్లోనే ధాన్యం..
– రైతుల రాస్తారోకో
నవతెలంగాణ – హాజీపూర్‌ /జోగిపేట

కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 10రోజులు పైగా అవుతున్నా.. కొనుగోలు చేస్తలేరని సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. దళితులమైనందుకే తమ వడ్లు కొనుగోలు చేస్తలేరని మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలోని గుడిపేట్‌ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం దళిత రైతులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 20 రోజుల కిందట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించామన్నారు. నిబంధనల ప్రకారం ఆరబెట్టి కుప్పలు చేశామని, అయినా పక్కనున్న పెద్ద కులాల రైతుల వడ్లు కాంటా వేస్తున్నారు కాని చిన్న కుప్పలు అని తమ వడ్డు కొనుగోలు చేయడం లేదని వాపోయారు. ఇదేమని అడిగితే మీరు ఏమైనా చేసుకోండి మీ కుప్పలు కాంటా వేయమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిపేట్‌ గ్రామ దళిత రైతులకు కేవలం ఎకరం లోపు భూములు మాత్రమే ఉన్నాయని, అందుకే చిన్న కుప్పలున్నాయని తెలిపారు. కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా పట్టించుకోవడం లేదని దళిత రైతు బెడ్డెల శ్రీనివాస్‌ తెలిపారు. వడ్లు కొనుగోలు జరగక మానసికంగా కృంగి పోతున్నామని,ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నాం, ఏండ్ల తరబడి ఇక్కడే జీవిస్తున్నాం అయినా వివక్ష ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వడ్లు కొనుగోలు చేసేలా చర్య తీసుకోవాలి.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి వారం రోజులవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేట మార్కెట్‌ యార్డు ఎదుట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. లారీలు రావడంలేదనే సాకుతో అధికారులు తమ ధాన్యాన్ని తూకం వేయడం లేదన్నారు. తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. తక్షణమే అధికారులు తమ ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సామ్యానాయక్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉప తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డి రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. రైతులు చెప్పిన సమస్యలు విని ఉన్నతాధికారులకు ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. రైతులు శంకర్‌, నగేష్‌, శ్రీనివాస్‌, గోపాల్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.