– అది రుజువైతే పదిరెట్లు జరిమానా
– ఫీజుల్లో 5 శాతమే లాభాలు పొందాలి
– 50 శాతం సిబ్బంది జీతాలివ్వాలి
– 15 శాతం గ్రాట్యూటీ, పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి
– ఫీజు వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి
– వార్షికాదాయాన్ని 30లోపు విద్యాశాఖకు సమర్పించాలి : ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల వసూలుకు చెక్ పెట్టాలని భావించింది. అందులో భాగంగా విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం వసూలు చేస్తున్న ఫీజుల్లో ఐదు శాతమే వారి లాభాలు పొందాలని స్పష్టం చేశారు. 50 శాతం సొమ్మును సిబ్బంది జీతాలకే కేటాయించాలని సూచించారు. 15 శాతం భవనాల మరమ్మతులు, విద్యుత్, నీటి బిల్లులతోపాటు స్టేషనరీకి వినియోగించాలని తెలిపారు. 15 శాతం సొమ్మును ఆ పాఠశాల అభివృద్ధికి వాడుకోవాలని పేర్కొన్నారు. 15 శాతం సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలనీ, ఉదాహరణకు గ్రాట్యూటీ, ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీంను అమలు చేయాలని కోరారు. కాపిటేషన్ ఫీజును వసూలు చేయొద్దని ఆదేశించారు. ఏదైనా పాఠశాల, వ్యక్తి కాపిటేషన్ ఫీజును వసూలు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామనీ, అందుకు పది రెట్లు జరిమానా విధించి తిరిగి వసూలు చేస్తామని హెచ్చరించారు. ఆయా పాఠశాలల నోటిసు బోర్డుపై ఫీజు వివరాలు ఉంచాలని కోరారు. వార్షికాదాయ వివరాలను ఈనెల 30లోపు విద్యాశాఖకు సమర్పించాలని ఆదేశించారు. అది చార్టెర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరించాలని సూచించారు. ఒక పాఠశాల కంటే ఎక్కువ విద్యాసంస్థలను ఒకే యాజమాన్యం నడిపితే విడివిడిగా వివరాలను అందించాలని కోరారు. ప్రతి పాఠశాల గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో ఆ యాజమాన్యం ప్రెసిడెంట్, సెక్రెటరీ/కరస్పాండెంట్/మేనేజర్‌తోపాటు హెడ్మాస్టర్ లేదా ప్రిన్సిపాల్, బోధనా సిబ్బందిలో ఒకరు, పేరెంట్ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీఈవో సిఫారసు చేసిన చదువుకున్న తల్లి ఉండాలని వివరించారు. ఏడాదికి మూడుసార్లు గవర్నింగ్ బాడీ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. ఆ విద్యాసంస్థ ఆర్థిక పరమైన పరిస్థితిని బట్టి సిబ్బందికి జీతాలను చెల్లించాలని కోరారు. ఎంఈవోలు, డీప్యూటీఐవోఎస్‌లు, డిప్యూటీఈవోలు, డీఈవోలు ప్రయివేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజు వివరాలు, ఖర్చు, సిబ్బందికి చెల్లిస్తున్న జీతాలకు సంబంధించి వాటిని సందర్శించి వివరాలను పరిశీలించాలని ఆదేశించారు.