దసరా సెలవుల జీతం కట్‌చేయవద్దు

– గురుకులాల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్తులకు : కుల నిర్మూలన వేదిక డిమాండ్‌
నవతెంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వివిధ రకాల గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ కింద పని చేస్తున్న గెస్టు టీచర్లు, లెక్చరర్లు, బోధనేతర ఉద్యోగులకు దసరా సెలవుల్లో పూర్తి జీతం చెల్లించాలని కుల నిర్మూలన వేదిక (కెఎన్‌వీ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం కెఎన్‌వీ రాష్ట్ర అధ్యక్షులు పావని నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.
దసరా సెలవులను వర్కింగ్‌ డేస్‌గా గుర్తించడం వలన గురుకులాల్లో టీచర్లు, లెక్చరర్లు గంటల ప్రాతిపదికన కాకుండా పూర్తి కాలం పని చేస్తున్నందున వీరి శ్రమ దోపిడికి గురికాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఆయన కోరారు.