– అధికారులు అడిగితే సీఎం మాటలు గుర్తు చేయండి
– ప్రజలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన
– రేవంత్ ఓ అహంకారి, కాంగ్రెస్‌కు ఓ ఏక్‌నాథ్ షిండే అంటూ ఎద్దేవా
– ఆయనలాంటి వారిని వేల మందిని చూశామంటూ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గృహజ్యోతి పథకం కింద ప్రజలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామంటూ కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందనీ… అందువల్ల ఈనెల (జనవరి)లో ఎవరూ కరెంటు బిల్లులు కట్టొద్దంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అధికారులెవరైనా వచ్చి బిల్లుల గురించి అడిగితే, ఎలక్షన్లలో సీఎం రేవంత్ చెప్పిన మాటలను వారికి గుర్తు చేయాలంటూ కోరారు. ‘ఉచిత విద్యుత్తును అమలు చేయకపోతే మా నాయకురాలు సోనియా గాంధీయే బిల్లులు కడతారు…’ అంటూ సీఎం మొన్నటి ఎన్నికల్లో చెప్పారనీ, ఇప్పుడు అవే మాటలను తిరిగి కాంగ్రెస్‌కు వినిపించాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలనుద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, సీఎం రేవంత్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతులో బొంద పెడతామని సీఎం మాట్లాడుతున్నారు.. ఈ సంగతిని పక్కనబెట్టి ముందు మీరు వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను అమలు చేయండి…’ అని హితవు పలికారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారనీ, అలాంటి వారిని బీఆర్‌ఎస్ తన ప్రస్థానంలో కొన్ని వేల మందిని చూసిందని వ్యాఖ్యానించారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అంటూ అనేక మంది తమ పార్టీని అవమానించారనీ, కానీ రెండున్నర దశాబ్దాలుగా నికరంగా నిలబడి, రేవంత్ లాంటి అనేక మందిని అది మట్టికరిపించిందని హెచ్చరించారు. తెలంగాణ జెండా (బీఆర్‌ఎస్)ను ఎందుకు బొందపెడ్తవ్..? తెలంగాణను తెచ్చి, అభివృద్ధి చేసినందుకా..? మీ దొంగ హామీలను ప్రశ్నించినందుకా..? అని నిలదీశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోయాయనీ, రానున్న పార్లమెంటు తర్వాత కూడా అవి ఇదే రకంగా వ్యవహరిస్తాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు రేవంత్ ఒక ఏకనాథ్ షిండేలా మారటం ఖాయమని చురకలంటించారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ ఒక చోటా మోడీలా మారిపోయారు, గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన ఆయన… ఇప్పుడు రోజూ అదే అదానీ వెంట పడుతున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అని పేర్కొన్న సీఎం… ఇప్పుడు వారికి ట్రిపుల్ ఇంజిన్‌గా మారారని దుయ్యబట్టారు. స్విట్జర్లాండ్‌లో అదానీ, రేవంత్ అలరు బలరు చేసుకున్నారని అన్నారు. వారి ఒప్పందాల అసలు లోగుట్టును బయటపెట్టాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కిషన్… ఐదేండ్లలో ఏం ఒరగబెట్టారు…?
సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవిని చేపట్టిన కిషన్‌రెడ్డి… గత ఐదేండ్ల నుంచి రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ కడితే, కిషన్‌రెడ్డి మాత్రం సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్‌లను జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఇదే ఆయన చేసిన అతి పెద్ద పనంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని నిలువరించేది, అడ్డుకునేది ముమ్మాటికీ బీఆర్‌ఎస్సేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆ పార్టీతో తమకు గతంలో పొత్తు లేదు, భవిష్యత్తులోనూ ఉండబోదని స్పష్టం చేశారు.