కార్మికులను ఇజ్రాయిల్‌ పంపొద్దు

కార్మికులను ఇజ్రాయిల్‌ పంపొద్దు– పాలస్తీనాకు సంఘీభావం తెలపండి
– ఇజ్రాయిల్‌ మారణహోమాన్ని నిరసించండి : మోడీ ప్రభుత్వానికి సీఐటీయూ డిమాండ్‌
న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కోరిక మేరకు భారతీయ కార్మికులను ఆ దేశానికి పంపవద్దని సీఐటీయూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమానికి వత్తాసు పలకవద్దని, పాలస్తీనా ప్రజలకు సంఘీ భావం తెలపాలని కోరింది. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ దళాలు వెంటనే కాల్పుల విరమణ పాటించేలా, ఆక్రమణల నుండి పాలస్తీనా భూభాగానికి విముక్తి కల్పించేలా కృషి చేయాలని మోడీ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.’ఇజ్రాయిల్‌ దళాలు పాలస్తీనాపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుపుతూ మహిళలు, చిన్నారులు సహా వేలాది మంది ప్రజలను పొట్టనపెట్టుకుంటున్నాయి. అంతేకాక తమ దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న పాలస్తీనా కార్మికులను దేశం విడిచి వెళ్లాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ క్రమంలో ఇజ్రాయిల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ వారు యాభై వేల నుండి లక్ష మంది కార్మికులు, నిర్మాణ కార్మికులను పంపాలని మన దేశాన్ని కోరుతున్నారు. ఇజ్రాయిల్‌లో పని చేసేందుకు వీరిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇజ్రాయిల్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఇప్పటికే మన ప్రభుత్వానికి నేరుగా, అక్కడి ప్రభుత్వం ద్వారా అభ్యర్థన పంపినట్లు తెలిసింది. ఇజ్రాయిల్‌లో పనిచేస్తున్న పాలస్తీనా కార్మికుల పట్ల అక్కడి ప్రభుత్వం అమానుషంగా, ఆటవికంగా ప్రవర్తించడాన్ని సీఐటీయూ తీవ్రంగా నిరసిస్తోంది. ఖండిస్తోంది. పాలస్తీనాలో ఇప్పటికే ఇజ్రాయిల్‌ దళాలు ఉద్దేశపూర్వకంగా మారణహోమానికి పాల్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ కార్మికులను ఇజ్రాయిల్‌కు పంపవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఒకవేళ కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకున్నప్పటికీ స్పందించవద్దని, తిరస్కరించాలని కార్మికులను కోరుతున్నాం’ అని తపన్‌ సేన్‌ ఆ ప్రకటనలో కోరారు.
ఇలాంటి కీలక సమయంలో ఇజ్రాయిల్‌కు భారతీయ కార్మికులను పంపడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్యను సీఐటీయూ అభినందించింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం, అక్కడి బిల్డర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థనను తిరస్కరించాలని కార్మిక వర్గం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కాల్పుల విరమణ పాటించాలంటూ ఐరాస ఇటీవల చేసిన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని, అన్ని రకాల ఆక్రమణల నుండి పాలస్తీనా భూభాగానికి విముక్తి కలిగించడానికి కృషి చేయాలని మోడీ ప్రభుత్వానికి సూచించింది.
పాలస్తీనా ప్రజలకు, వారి డిమాండ్‌కు సంఘీభావంగా, అదే సమయంలో పాలస్తీనాకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని కార్మికలోకానికి సీఐటీయూ పిలుపునిచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మన దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పాలస్తీనా అంశంపై ఈ నెల 7-10 తేదీల మధ్య ప్రగతిశీల, వామపక్ష శక్తులు నిర్వహిస్తున్న నిరసన-సంఘీభావ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని కార్మికులను కోరింది.