ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వొద్దు

Do not support SC classification– సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజాకు మాలమహానాడు విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసమే ఎస్సీ వర్గీకరణ చేయాలని చూస్తున్నారనీ, అలాంటి నిర్ణయాలకు మద్దతివ్వొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య జాతీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ. రాజాను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ ఉషా మెహ్రా కమిషన్‌ పేర్కొన్నట్టు తెలంగాణలో మాల, మాదిగల్లో ఎవరు అభివృద్ధి చెందారో శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు జ్యూడిషీయల్‌ కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే దళితుల జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలన్నారు. కాలం చెల్లిన వర్గీకరణ డిమాండ్‌ ను పక్కన పెట్టి అండేడ్కర్‌ కలలుకన్న రాజ్యాధికారం కోసం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
వర్గీకరణ పేరుతో రాజ్యాధికారానికి దూరం చేస్తున్రు…
ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి నైతికతతో వారిని రాజ్యాధికారం అనే లక్ష్యానికి దూరం చేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్‌ అన్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఎస్సీలపై అనేక దాడులు, హత్యలు జరుగుతున్నాయన్నారు. గతంలో యూపీఏ, బీజేపి లు అధికారంలో ఉన్నా ఎందుకు వర్గీకరణ చేయలేదో ఎస్సీ సోదరులు ఆలోచించాలన్నారు.