మన దేశంలో ఆవిర్భవించిన సాహిత్యాన్ని చదువుకోవచ్చు. ఆస్వాదించవచ్చు. అధ్యయనమూ చేయవచ్చు. కానీ కావ్యాలను, పురాణ కథలను వాస్తవిక చరిత్రగా చదవటం వలన సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లోపిస్తుంది. అయితే కల్పన ఏమిటో వాస్తవమేమిలో తెలియక గందరగోళమవుతుంది. రామాయణ, భారతకథల సారాంశం, కులపరంగా విభజితమైన నిచ్చెనమెట్ల సామాజిక జీవనం. దీన్ని ఒక ఆదర్శంగా, అదే మన జీవన విధానంగా స్థిరపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది.
చిన్నతనంలో సాయంత్రం కాగానే పల్లెల్లో ఏదో ఒక కళాప్రదర్శన రచ్చబండ దగ్గర జరుగుతుండేవి. ఒక సారి హరికథ కాలక్షేపమయితే, మరోసారి బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలు ఇలా కొనసాగేవి. వీటిల్లో ఎక్కువ శాతము హరిని గురించిన పురాణమే కథలుగా వినిపించేవారు. రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చిన సామాన్య జనులకు వినోదము, సాంస్కృతిక కళాపోషణ వుండేది. తమ బతుకులకతీతమైన ఓ సుందర కథా గానంతో తేలిక పడేవాళ్లు వారు. ఆ కళారూపాల్లో ప్రధానంగా రామాయణ, మహాభారత కథలు, అందులోని అనేక ఉపకథల ఉపదేశాలే వుండేవి. అందుకనే ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనే నానుడీ వచ్చింది. ఇక రామాయణ కథా రసాస్వా దనలో తెలియాడేవారు. ఎందుకంటే కరుణ రసం కదిలించని హృదయముంటుందా? కథలు వినటం, కథలు చెప్పటం మానవ పరిణామంలో సాంస్కృతిక చలనంలోంచి సంత రించుకొన్నదే. పురాణాలన్నీ ఆర్యుల జయాపజయాలు, వైదికమత ప్రచారాల నిమిత్తమై నిర్మాణమైనవన్నది జగద్వితమే. అయితే రామాయణం గొప్ప కావ్య గౌరవాన్ని పొందింది. ఇప్పటికీ జనుల ఆదరణ, ఆలకింపు పొందుతోందంటే ఆ కథా కధనంలో వున్న గొప్ప తనమే కారణం. ఇక భారతాన్ని ఇతిహాసంగా పేర్కొంటారు. అంటే కొంత చరిత్ర మిళి తమైన కథాసారమని చెప్పవచ్చు. వీటిల్లో కొంత కాల్పనికత, సామాజికత, రాజుల, రాజ్యాల వైయిక్తిక వైభవ ప్రదర్శన అన్నీ కలిసి వున్న వాటిగానే పురాణేతిహాసాలను, కావ్యా లను చూడాలి. అందుకనే మనం అప్పుడప్పుడు హరికథలు చెప్పకురా! అంటాం.
ఇప్పుడివన్నీ ఎందుకు ప్రస్తావించడమంటే, ఈ రామాయణ, మహాభారతా లను చరిత్ర పాఠాలుగా విశ్వవిద్యాలయాలు పెట్టబోతున్నాయి.మనం హరికథ లుగా విన్నవన్నింటిని పాఠాలుగా అధ్యయనం చేయాలన్నమాట. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల చరిత్ర పాఠ్య పుస్తకాలలో రామాయణ కథను, మహాభారత కథను, భగవద్గీత విషయాలను చరిత్రగా పాఠాలు చెప్పబోతున్నారు. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చాక చరిత్రను వక్రీకరించడం, వాస్తవిక చరిత్రను తొలగించడం చేస్తున్నారు. వాటి స్థానంలో మత సంబంధిత అంశాలను, పురాణ కథలను చరిత్రగా బోధించేట్లయితే రాబోయే తరం భవిష్యత్తు తీవ్ర సంక్షోభంగా మారుతుందని విద్యావేత్తలు వాపోతున్నారు. ఇలా చరిత్రను ఎందుకు మారుస్తున్నారన్న ప్రశ్నకు, గతంలో చరిత్రను రాసిన వాళ్లంతా మార్క్సిస్టులు కాబట్టి పాఠ్యాంశాలను మారుస్తున్నామని చెపుతున్నారు. ఎవరు రాసినా ఆ చరిత్ర వాస్తవమా? కాదా? అనేది ముఖ్యమనే విషయాన్ని, విస్మరిస్తున్నారు. మన దేశంలో ఆవిర్భవించిన సాహిత్యాన్ని చదువుకోవచ్చు. ఆస్వాదించవచ్చు. అధ్యయనమూ చేయవచ్చు. కానీ కావ్యాలను, పురాణ కథలను వాస్తవిక చరిత్రగా చదవటం వలన సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లోపిస్తుంది. అయితే కల్పన ఏమిటో వాస్తవ మేమిలో తెలియక గందరగోళమవుతుంది. రామాయణ, భారతకథల సారాంశం, కుల పరంగా విభజితమైన నిచ్చెనమెట్ల సామాజిక జీవనం. దీన్ని ఒక ఆదర్శంగా, అదే మన జీవన విధానంగా స్థిరపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది. అంతేకాక అన్ని అన్యాయాలను, అసమానతలను ధర్మబద్ధం చేయటమూ ఈ బోధనలో వుంది.
ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రయోగాలు చేస్తూ, ఖగోళ విజ్ఞానం చంద్రునిపై కాలుమోపి ప్రయోగాలు చేసి విజయం పొందుతున్న సందర్భంలో, విశ్వాసాల ప్రాతిపదికన చరిత్రను విద్యార్థులకు అందిస్తే ఏ రకమైన సమాజం ఏర్పడుతుందో మనం ఊహించవచ్చు. మన రాజ్యాంగం ఇచ్చిన స్పూర్తికి భిన్నమయిన ఆచరణ ఇది. చరిత్ర అంటే మానవజాతి పరిణామక్రమ శాస్త్రం. చరిత్ర పఠనం ద్వారా మనం స్పష్టమైన దృక్పథాన్ని అలవరచు కొని, నాణ్యమైన విజ్ఞానం ద్వారా మన జీవితాలను మెరుగు పరచుకోవాలి. కానీ నేడు కేంద్రంలో అధికారం చేస్తున్న పాలక వర్గాలు, తమ రాజకీయ, భావజాలానికి అనుగుణంగా చరిత్రనే వక్రీకరించే పనికి పూనుకోవటం తగనిపని. ఇది విజ్ఞాన భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ”ఈ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ, కైఫీయతులూ ఇవికావోరు చరిత్ర సారం” అన్న శ్రీశ్రీ మాటలు అక్షరసత్యాలు. పుక్కిటి పురాణాలను మన చరిత్రగా చెప్పే ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరం. చరిత్రకారులు, మేధావులు, విద్యావేత్తలు దీన్ని అడ్డుకోవాలి.
కథలు చరితలౌతాయా!
11:37 pm