– వార్తాపత్రికల మొదటి పేజీల్లో బ్లాక్ యాడ్స్
– న్యాయ వ్యవస్థపై దాడికి నిరసనగా ఇజ్రాయిల్‌లో ఆందోళనలు
– నెతన్యాహుపై పెరిగిన వ్యతిరేకత
జెరూసలేం : ఇజ్రాయిల్ న్యాయ వ్యవస్థపై మితవాద ప్రభుత్వం జరుపుతున్న దాడిని నిరసిస్తూ డాక్టర్లు 24గంటల సమ్మెను నిర్వహించారు. మంగళవారం నాటి వార్తాపత్రికల మొదటి పేజీలు బ్లాక్ యాడ్స్‌తో నిండిపోయాయి. న్యాయ వ్యవస్థ ప్రక్షాళన పేరుతో తీసుకువస్తున్న మొదటి విడత చర్యలను ప్రభుత్వం ధృవీకరించడంపై ఆందోళన జరుగుతోంది. ఈ చర్యలు న్యాయ స్థానాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ముప్పుగా పరిణమిస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సుప్రీం కోర్టు సమీక్షించడానికి రద్దు చేస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చింది. ఆ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. బిల్లును నిరసిస్తూ ప్రతిపక్షాల సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. సుదీర్ఘకాలం దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నెతన్యాహు దేశాన్ని నియంతృత్వం దిశగా నడుపుతున్నారని విమర్శించారు.
ఇజ్రాయిల్‌లో నెలల తరబడి నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. వేలాదిమంది వీధుల్లోకి వస్తున్నారు. సోమవారం రాత్రి పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణ పడ్డారు. ఇది ”ఇజ్రాయిల్ ప్రజాస్వామ్యం చీకటి దినం” అని ప్రధాన వార్తాపత్రికల మొదటి పేజీల్లో యాడ్ ప్రచురితమైంది. ఆందోళన చెందుతున్న హై టెక్ వర్కర్లుగా చెప్పుకుంటున్న గ్రూపు ఈ యాడ్‌లను ఇచ్చింది.
ప్రభుత్వం గనుక తన ప్రణాళికలతో ముందుకు వెళ్ళినట్లైతే, మిలటరీ రిజర్విస్ట్‌లు ఎవరూ తమ విధులకు హాజరు కాబోరని ఆందోళన జరుపుతున్న నేతలు చెప్పారు. దీనివల్ల ఇజ్రాయిల్ యుద్ధ సన్నద్ధత దెబ్బ తింటుందని మాజీ సైనికాధ్యక్షులు ఆందోళన చెందుత్నురు. అయితే అలా విధులకు రాని వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు సైన్యం తెలిపింది.
నెతన్యాహ విజయావకాశాలకు ఎదురు దెబ్బ
తాజాగా తీసుకున్న నిర్ణయాలతో రాబోయే ఎన్నికల్లో ప్రధాని నెతన్యాహుకు విజయావకాశాలు దెబ్బ తింటాయని ఒపీనియన్ పొల్స్‌లో వెల్లడైంది. ప్రధాన స్రవంతి లోని రెండు వార్తా ప్రసార సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం స్పష్టమైంది. తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తే నెతన్యాహు పాలక సంకీర్ణానికి వచ్చే సీట్ల సంఖ్య 64 నుండి 52 లేదా 53కి పడిపోతుందని హెచ్చరించింది. ఆయన స్వంత లికుడ్ పార్టీకి 32 నుండి 28కి సీట్లు తగ్గుతాయని ఎన్12 న్యూస్ తెలిపింది. 25సీట్లే వస్తాయని రెషెట్ 13 సంస్థ పేర్కొంది.