వ్యవసాయంపై రేవంత్‌ రెడ్డికి అవగాహన ఉందా?

– ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ నిజస్వరూపం బహిర్గతం
– చంద్రబాబు వారసుడని నిరూపించుకున్న రేవంత్‌

– కాంగ్రెస్‌ కు ఓటేస్తే …ప్రజలకు పాము, తేలు కాట్లే గతి : మంత్రి జగదీశ్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఒక ఎకరానికి నీరు పారాలంటే గంట కరెంట్‌ ఇస్తే చాలంటున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన ఉందా? అని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రేవంత్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూపం బహిర్గతమైందనీ, ఆయన చంద్రబాబు వారసుడని మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి వెళ్లినా… ఆయన నీడలు, జాడలు ఇంకా ఇక్కడే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్‌ కు ఓటేస్తే ప్రజలకు పాము, తేలు కాట్లే మిగులుతాయని తెలిపారు.
‘2004 నాటి పరిస్థితులను 20 యేండ్ల తర్వాత గుర్తుకు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. నాడు చంద్రబాబు ఉచిత విద్యుత్‌పై ఏం మాట్లాడారో నేడు రేవంత్‌ అదే మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ పై రేవంత్‌ మాట్లాడిన మాటలు రైతులకు పిడుగుపాటు లాంటివే. రైతాంగం అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి పొందింది అనుకుంటున్న తరుణంలో రేవంత్‌ రూపంలో కొత్త భాద వచ్చిపడింది. గతంలో కాంగ్రెస్‌ ఏడు గంటలపాటు కూడా రైతులకు కరెంటు ఇవ్వలేక పోయింది. .రైతుకు మొదటి శత్రువు ఆ పార్టీయే. రాష్ట్ర రైతాంగం కూడా రేవంత్‌ వ్యాఖ్యలపై ఆలోచించుకోవాలి. ఇక కాంగ్రెస్‌ జెండా పట్టుకున్న రైతులు ఆలోచించుకోవాలి. గతంలో కాంగ్రెస్‌ ఆరు గంటలు కరెంటు ఇస్తే రేవంత్‌ తదితర టీడీపీ నేతలే కదా ధర్నాలు చేసింది. …’ అని మంత్రి విమర్శించారు.
రేవంత్‌ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంటు ఉండాలే…కానీ రైతులకు 24 గంటలు ఇవ్వొద్దా అంటూ జగదీశ్‌ రెడ్డి ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే కాంగ్రెస్‌ పార్టీకి చిన్నచూపని విమర్శించారు. ఎప్పుడంటే అప్పుడు కరెంట్‌ ఆన్‌ చేసుకునే సౌకర్యం రైతుకుండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించారని గుర్తుచేశారు. రేవంత్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదనీ, ఆయన టీపీసీసీ అధ్యక్షునిగా చేశారనీ, ఇక కాంగ్రెస్‌ ప్రజల నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చి మూడు గంటల పాటే కరెంట్‌ సరఫరా చేస్తామని చెప్పినా ఆశ్చర్యపోయేదేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ అంటేనే రద్దుల పార్టీ అని, ఉచిత విద్యుత్‌ను రేవంత్‌, యాదాద్రి ప్లాంటును ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రద్దు చేస్తామంటున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఏ పార్టీతో టచ్‌లో లేరనీ, ప్రజలంతా కేసీఆర్‌తోనే టచ్‌లో ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు