ఈ ప్రభుత్వం వితంతు పెన్షన్‌లు కూడా ఇవ్వదా..

– మండల పరిషత్‌ సమావేశంలో సర్పంచ్‌ల ధ్వజం
నవతెలంగాణ-వైరా
రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గొప్ప పథకాలను ప్రతి రోజూ ఊదర గొట్టటమే గాని భర్తలను కోల్పోయిన మహిళలకు వితంతు పెన్షన్‌ కూడా ఇచ్చే స్థితిలో లేదని వైరా మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు ద్వజమెత్తారు. గురువారం మధ్యాహ్నం ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో పలువురు సర్పంచ్‌ లు మాట్లాడుతూ 58 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం 2022లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి మాత్రమే ఇచ్చి ఆపివేసినట్లు కూడా వారు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రక రకాల కారణాలతో భర్తలను కోల్పోయిన పేద మహిళలకు సహితం రెండు సంవత్సరాలుగా పెన్షన్‌ కు నోచుకోని వారున్నారని విప్పలమడక, కొస్టాల, తాటిపూడి తదితర గ్రామాల సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై ఎన్ని సార్లు అడిగినా ఆన్‌ లైన్‌ ఆపేసినట్లు సమాధానం వస్తుందని, పెన్షన్‌ మంజూరు విధానం ఎలక్షన్‌ టు ఎలక్షన్‌ ఉండకూడదని, నిరంతర చర్యగా ఉండాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌ లైన్‌ చేసుకున్న అర్హులైన వారికి వెంటనే పెన్షన్‌ లు మంజూరు చేయాలని కోరారు. మండలం లోని వివిధ గ్రామాలలో విద్యుత్‌ స్తంభాలు వరిగి పోయి ప్రమాద కరంగా ఉన్నాయని, ఇటీవల సంభవించిన భారీ వర్షాలు గాలులకు వరిగిన స్తంభాలను పరిశీలించి సరి చేయాలని సర్పంచ్‌లు ఎంపీటీసీలు కోరారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాను ఆర్‌డబ్ల్యుఎస్‌ పర్యవేక్షిస్తుందని చెబుతున్నప్పటికీ దాని తీరు ఎన్ని సమావేశాల్లో చర్చించినా మార్పు ఉండటం లేదని, ఒక్కో వారం గ్రామాలలో ట్యాంకులకు నీరు ఎక్కించటం లేదని సర్పంచ్‌ లు సమావేశంలో విమర్శించారు. మరలా గ్రామాలలో ఇంకుడు గుంతల పని ప్రారంభించాలని కోరగా సర్పంచ్‌ లు ససేమిరా అన్నారు. సమావేశం ఎంపీటీసీ కోరం పూర్తి గాక గంటకు పైగా ఆలస్యం అయినది. సమావేశం వాయిదా వేయాల్సి వచ్చే సమయంలో ముసలి మడుగు ఎంపీటీసీ శీలం వెంకట రామిరెడ్డి రావటంతో సమావేశం జరిగింది. సర్పంచ్‌ల హాజరు కూడా సగానికి తక్కువగా ఉండటం చర్చనీయాంశం అయింది. సమావేశంలో జడ్‌పిటిసి నంబూరి కనకదుర్గ, జడ్‌పి కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ లాల్‌ అహమ్మద్‌, ఎంపిడిఓ శ్రీదేవి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.