ఇంటిపనివార్లను కార్మికులుగా గుర్తించాలి

– ఐఎల్‌ఓ కన్వెన్షన్‌ 189ని అమలు చేయాలి
– జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇండ్లల్లో పనిచేసే వాళ్లను కార్మికులుగా గుర్తించాలనీ, వారికి ఐఎల్‌ఓ కన్వెన్షన్‌ 189ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ కోరింది. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌లో జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆర్‌. చంద్రశేఖరంను సీఐటీయూ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా ఉన్న గహ కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలనీ, 8 గంటల పనిదినానికి రూ.600, డీఏ, వారాంత సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలనీ, 30 రోజుల వార్షిక వేతనంతో కూడిన సెలవు, పది రోజుల వేతనంతో కూడిన అనారోగ్యం సెలవు, వార్షిక బోనస్‌, ఏడాదికి 15 రోజుల గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, తదితర సామాజిక భద్రతా పథకాలను గృహకార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. 55 ఏండ్ల తర్వాత నెలకు కనీసం రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం అమలు చేయాలనీ, 2008 ప్రకారం గహ కార్మికులందరికీ తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. తగిన నిధులతో గహ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గృహ కార్మికుల కోసం ప్రత్యేక పాత్రలు, ప్రవేశాలు, లిఫ్టులు మొదలైన అంశాల్లో వివక్షాపూరిత పద్ధతులను పాటిస్తూ గృహ కార్మికులను చులకన భావంతో చూసే పద్ధతికి స్వస్తిచెప్పేలా చూడాలన్నారు. ఇండ్ల వద్ద పనిచేసేటప్పుడు మరుగుదొడ్లను ఉపయోగించడం కోసం అనుమతి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు 30 శాతం పని దినాలతో కూడిన పట్టణ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని కోరారు.