సమస్యలు పరిష్కరించేవరకు వెనక్కి తగ్గం

– గ్రామ పంచాయతీ కార్మికులు కొనసాగుతున్న సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని గ్రామ పంచాయతీ కార్మికులు స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మల్టీపర్పస్‌ విధానాన్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కూడా కొనసాగింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జీపీకార్మికులు చేపట్టిన సమ్మెకు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. గ్రామపంచాయతీ రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులతో కలిసి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో జాయింట్‌ చర్చలు జరిపామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి జీపీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. గరిడేపల్లి మండలంలో జీపీ కార్మికులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. భువనగిరి మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో సమ్మెకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చర్చలకు పిలిచినట్టే పిలిచి సీఎస్‌ అమెరికాకు వెళ్లారని, ఆమె వచ్చాక చర్చలు జరుపుతామని, సమ్మె మాత్రం విరమించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమతో చర్చలు జరిగే వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల సమ్మెకు ఐకేపీ ఏపీఎం వెంకటే శ్వర్లు సంఘీభావం తెలిపారు. ముదిగొండలో నిరసన వ్యక్త చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జీపీ కార్మికులు బిక్షాటన చేసిన నిరసన తెలిపారు. అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.5000 అందజేశారు. ఇల్లందులో ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు సంఘీభావం తెలిపారు.