ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు

 అమెరికా నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-సిద్దిపేట
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటాల విషయంలో అధికారులు అలసత్వం వహించరాదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిన సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో అండగా నిలుద్దామని దిశానిర్దేశం చేశారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల అంశంపై జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మొత్తం 2300 మందితో కలిసి శనివారం మంత్రి హరీశ్‌రావు అమెరికా నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మెన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ముజమ్మీల్‌ ఖాన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, ఏంపీటీసీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మెన్లు, కోఆపరేటీవ్‌, మార్కెట్‌ కమిటీ, రెవెన్యూ, ఐకేపీ, రైతుబంధు సమితి ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 415 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించినట్టు, ఇప్పటిదాకా 7304 మంది రైతుల నుంచి రూ.67 కోట్ల విలువైన 32508 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు.