
– ఇప్పుడు కొత్తగా ఏవో మాయమాటలు చెబుతున్నారు
– ఇవి సీఎం ఎవరో తేల్చే ఎన్నికలు.. కేసీఆర్ సీఎంగా ఉంటేనే నీళ్లు, కరెంటు, పింఛన్లు
– కాంగ్రెస్ పాలనలో బ్యాటరీ టార్చర్లు, విసనకర్రల బాధలు మరిచిపోయామా
– పలు మండలాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్ ఎన్నికల వేళ ప్రజలకు మేనిఫెస్టో రూపంలో చూపుతున్న రంగుల ప్రపంచాన్ని చూసి మోసపోవద్దని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పడ్గల్ వడ్డెరకాలనీ, మోర్తాడ్ మండలంలోని సంతోష్ నగర్ కాలనీ, ఏర్గట్ల మండలంలోని తోర్తి, కమ్మర్‌పల్లి మండలంలోని రాజరాజేశ్వరి నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడన్నారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే అలవిమాలిన, తనకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బీజేపీ కూడా మాయమాటలు చెబుతున్నదన్నారు. ఈ రెండు పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కావడం లేదని, మొన్ననే గెలిచిన కర్ణాటకలో పించన్ ఏడు వందల యాభై ఇస్తుండగా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వెయ్యి రూపాయలు మాత్రమే ఫించన్ ఇస్తున్నదని అన్నారు. ఇక్కడ మేనిఫెస్టో రూపంలో మోసం చేసే ఈ పార్టీలు ముందు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో వీటిని అమలు చేసి ఆ తరువాత ఇక్కడికి వచ్చి వాటిని చెప్పుకుని ఓట్లు అడుక్కోవాలని మంత్రి సూచించారు. రుణమాఫీని ఆపిందని కాంగ్రెస్ వాళ్లేనన్నారు. మూడింట రెండొంతులు ఇప్పటికే మాఫీ చేసేశామని, మిగిలింది కూడా దానంతటదే అయిపోతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మూడో తారీఖు తరువాత ఎవరు ఆపినా రుణమాఫీ ఆగదని, దానికి తనదీ జిమ్మేదారీ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో మంచినీళ్ల గోస, కరెంటు కష్టాలు ఎలా ఉండేవి ఒక్కసారి ఆలోచించాలని, సీఎం కేసీఆర్, తను వచ్చాక ఇప్పుడెలా పరిస్తితి ఉందో గుర్తెరిగి మసలుకుంటే చాలు.. ఎవరికి ఓటు వేయాలో.. ఎవరికి వేటు వేయాలో మీకే అర్థమయిపోతుందని వివరించారు. కుల సంఘాలకు ఇచ్చిన ప్రొసీడింగు కాపీలు, కొత్త రోడ్ల జీవోలు, ఇవన్నీ ఎన్నికల కోసమేనని ఉత్త కాగితాలని కాంగ్రెస్ ఆరోపించడం వారి అజ్ఞానికి నిదర్శనమన్నారు. ఒక్కసారి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ కాపీ ఉత్తదే ఎందుకవుతుందని, పనులు కొనసాగుతున్న తీరు ప్రజలకు చూస్తున్నారని అన్నారు. తనకన్నా ముందున్న నాయకులకు రోడ్లు వేయాలని, చెక్ డ్యాంలు నిర్మించాలని, సాగునీరు అందించాలనే, ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్లవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదన్నారు. గృహలక్ష్మీ పథకం కింద ఇప్పటికే ఆరు వేల ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ప్రొసీడింగులను అందించామని, మరో పదివేల ఇండ్లకు సాంక్షన్ ఇవ్వాల్సిందిగా సీఎంను కోరితే, ఆయన అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారుంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇవి సీఎం ఎవరు కావాలో తేల్చే ఎన్నికలని ఆశామాషీ ఎన్నికలు కావన్న ఆయన.. సీఎంగా కేసీఆర్ వస్తేనే తాగు, సాగునీరు, కరెంటు, పింఛన్లు, సంక్షేమ పథకాలు నిరందిగా అందుతాయన్నారు. కాంగ్రెస్ వి అన్నీ బొక్కబోర్లా పడి బోల్తా కొట్టించే హామీలని వారితో ఏదీ సాధ్యంకాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.