– అధికారులకు ద.మ.రైల్వే జీఎమ్ అరుణ్‌కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దనీ, విధి నిర్వహణలో అలసత్వం పనికిరాదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారుల్ని హెచ్చరించారు. సోమవారంనాడాయన జోన్ పరిధిలో తీసుకుంటున్న రైల్వే భద్రతా ప్రమాణాలపై వివిధ శాఖలకు చెందిన ప్రధానాధికారులతో రైల్ నిలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎమ్ మాట్లాడుతూ భద్రతపై రైల్వే బోర్డు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలనీ, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలేని అన్నారు. రైళ్లలోని అగ్ని ప్రమాద నివారణా పరికరాల లభ్యతపై ఆరా తీసారు.