‘సంక్షోభాలు, విపత్తులు తలెత్తినప్పుడు ఎవరూ ఒంటరిగా మిగిలిపోకూడదు. ఆ అనుకోని పరిస్థితుల్లో బాధితులకు మనుగడ చూపించడమే అత్యున్నత ప్రమాణం’ అంటున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఇటీవల ఈ ట్వీట్ చేశారు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. అంతకుమించి మనసు చలించే కన్నీటి కథ దాగుంది. ఆరు వారాల క్రితం అంటే డిసెంబరు 9న శతి అనే యువతికి కేరళ రెవిన్యూ శాఖలో క్లర్క్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆమెకి ఆ ఉద్యోగం వచ్చింది. శతి వయనాడ్ వరద బాధితురాలు. వరదల్లో ఆమె సర్వస్వం కోల్పోయింది. ఆమెకి ఆదరువుగానే ప్రభుత్వం ఈ ఉపాధిని చూపించింది. అసలు శతికి ఏం నష్టం జరిగింది? తన జీవితంలో జరిగిన ఆ విషాదం ఏంటో తెలుసుకుందాం.
కోజీకోడ్‌లోని ఓ ప్రయివేటు హాస్పటల్‌లో శతి అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తించేది. చురల్‌మల్ గ్రామం ఆమె స్వస్థలం. జులై 30 తెల్లవారు జామున కొండచరియలు విరిగిపడి వయనాడ్ అతలాకుతలమైంది. ఆ వరదలకు చురల్‌మల్, దాని పక్కనే ఉన్న ముండక్కై గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. 420 మంది జనాభా బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వాళ్లల్లో శతి కుటుంబం కూడా ఉంది. ఆమె తల్లి, తండ్రి, చెల్లి, మామయ్య, అత్త ఇలా మొత్తం 9 మంది ఒకేసారి శతికి దూరమయ్యారు. ఇల్లు కొట్టుకుపోయింది. పెళ్లి కోసం భద్రపరిచిన నగలు, డబ్బు బురదలో కలిసిపోయాయి.
ఓ విషాదం, ఓ ప్రేమ..
శతికి, జెన్సన్‌కి వివాహం నిశ్చయం చేసుకున్నారు. అన్నీ బాగుంటే గత డిసెంబరులో వాళ్ల పెళ్లి జరిగేది. ఇంతలోపే ఈ విషాదం జరిగింది. శతి నిలువెల్లా కుంగిపోయింది. ఆ బాధ నుండి బయటికి తీసుకొచ్చేందుకు జెన్సన్ ఎంతో ప్రయత్నించాడు. అతను, ఆమె చిన్ననాటి స్నేహితుడు. స్నేహితురాలికి ధైర్యం చెబుతూ, నేనున్నానంటూ తోడుగా నిలిచాడు. వయనాడ్ వరద వార్తల్లో శతికి జరిగిన విషాదం, జెన్సన్ ఆమెకి అండగా నిలబడిన వైనం మీడియాలో ప్రధానంగా వచ్చింది.
తోడుగా ఉంటానని..
‘నా చివరి శ్వాస వరకు శతికి తోడుగా ఉంటాను. మేము ఇప్పుడు జీవితం మొదటి నుండి ప్రారంభించాలి. ఈ ప్రయాణంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇల్లు, ఉద్యోగం శతి కల. నేనెప్పుడూ తనని ఒంటరిగా వదలను. నా హదయానికి ఎప్పుడూ తనని దగ్గరగా ఉంచుతాను. నా మరణానంతరం కూడా శతి ఒంటరిగా ఉండకూడదు’ అని ఆ రోజు జెన్సన్ ఎంతో భావోద్వేగంతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. కొండచరియలు విరిగిపడినప్పడి నుండి జెన్సన్, శతి పక్కనే ఉన్నాడు. ‘అమ్మానాన్న చనిపోయి నేను ఒంటరి అయ్యానన్న బాధ తెలియకుండా జెన్సన్ నాకు తోడుగా నిలిచాడు’ అంటూ శతి కూడా ఆ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది. ఈ ప్రేమ జంట అనిర్వచనీయమైన ప్రేమ, ఔన్నత్యం దేశ నలుమూలలా వ్యాపించింది.
మధ్యలోనే వదిలేశాడు..
అమ్మానాన్న, బంధువుల మతశరీరాలను గుర్తుపట్టడం, వారికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడంలో జెన్సన్, శతికి నీడలా నిలబడ్డాడు. కుంగిపోతున్న తనలో పెళ్లితో కొత్త ఆశలు చిగురింప జేయాలని తపించాడు. కానీ సెప్టెంబరు 9న మరో ఉపద్రవం వాళ్ల జీవితాలని మరోసారి అల్లకల్లోలం చేసింది. శతి తల్లి మతదేహాన్ని డిఎన్‌ఎ ద్వారా గుర్తించామని, తీసుకెళ్లమని అధికారుల నుండి శతికి ఫోను వచ్చింది. ‘అమ్మ’కి అంత్యక్రియలు నిర్వహించి, తన సమాధి పక్కనే ఉన్న బంధువుల సమాధులకి నివాళులు అర్పించి, శతి, జెన్సన్ వెనుతిరిగారు. మరుసటి రోజు కారులో వస్తున్న ఆ ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో జెన్సన్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో శతి ఆస్పత్రి పాలైంది.
జీవితంలో అన్నీ కోల్పోయిన శతి పరిస్థితి తెలిసి ప్రతిఒక్కరూ కన్నీరు కార్చారు. ఓదార్పులు, సంఘీభావాలు వెల్లువలా వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే ఆశలు కోల్పోయిన శతికి మేమున్నామంటూ కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలా గత డిసెంబరు 9న శతిని విధుల్లోకి తీసుకున్నారు.
సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు
ఎర్ర కమీజు, తెల్ల ప్యాంటు వేసుకుని ఎడం చేతిలో క్లచ్చర్ పట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తూ శతి తన సీట్లో కూర్చొంది. యాక్సిడెంట్లో ఆమె రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంకా ఆమె పూర్తిగా కోలుకోలేదు. ఒకదాని తరువాత మరొకటి వరుస విషాదాల్లో కూరుకుపోయిన ఆమె జీవితంలో వచ్చిన ఈ అవకాశం తనలో ఎంతటి సంతోషాన్ని ఇచ్చిందో చూడాలని, తన చుట్టూ ఉన్న కెమెరాలు ఆరోజు కళ్లింత పెద్దవి చేసుకుని మరీ చూశాయి. ఆ అనుభవాన్ని శతి మాటల్లో తెలుసుకుందాం. ‘స్కూలు, కాలేజీ, ఆఫీసు ఎక్కడైనా మొదటిరోజు చాలా భయంగా ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఆ వాతావరణం కనిపించలేదు. అందరూ స్నేహపూర్వకంగా ఆహ్వానించారు. వారంతా నా పట్ల ఎంతో ప్రేమని చూపించారు. నాకు అన్ని విధాలుగా సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు’ అని శతి భావోద్వేగ స్వరంతో చెప్పింది.
ఈ సందర్భంగానే శతికి శుభాకాంక్షలు చెబుతూ ముఖ్యమంత్రి పినరయి ట్వీట్ చేశారు. కేరళ ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నా, ప్రజల ఐక్యమత్యం వల్లే వాటన్నింటినీ తట్టుకుని నిలబడిందని కొనియాడారు. ప్రజల పట్ల పాలకుల చిత్తశుద్ధికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. ‘సాయం చేస్తామని ప్రకటించి ఆ తరువాత చేతులు దులుపుకునే బాపతులా కాకుండా కేరళ గవర్నమెంట్ ఆ హామీని నిలబెట్టుకుంద’ని సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
అనంతోజు మోహన్‌కృష్ణ 8897765417