పరిధులు గీసుకోవద్దు

– అన్ని ఫిర్యాదులూ స్వీకరించాలి..మర్యాదగా మాట్లాడాలి
– పాలనా సౌలభ్యం కోసం వార్డు కార్యాలయాలు
– వార్డు స్థాయి అధికారులతో మంత్రి కేటీఆర్‌ ముఖాముఖి
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘పరిపాలనా సౌలభ్యం కోసమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి.. వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి అవసరమైతే సంబంధిత వార్డు కార్యాలయాలకు స్వయంగా అధికారులే పంపించాలేగానీ బాధితులను ఇబ్బందులకుగురి చేయొద్దు..’ అని పురపాలక పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిపాలనా సౌలభ్యంతోపాటు పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల సత్వర పరిష్కారానికి హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌ హైటెక్స్‌లో శనివారం నిర్వహించిన జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వాలు పని చేస్తేనే ప్రజల మన్ననలు పొందుతారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లుండగా, నగరంలో కోటీ 25 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రజల సమస్యలను స్థానికంగానే అధికారులు పరిష్కరించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వద్దకు రావడమంటే ఆ వ్యవస్థలో లోపమున్నట్టేనని చెప్పారు.
కరోనా సమయంలో హైదరాబాద్‌లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. పురపాలన అనే మాటలోనే ప్రజల భాగస్వామ్యం ఇమిడి ఉందన్నారు. ప్రపంచంలో అద్భుతమైన టోక్యో నగరంలా హైదరాబాద్‌ మారాలనీ, తెలంగాణ వచ్చినప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ అన్ని రంగాల్లో మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతి రోజూ 8 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను లిఫ్ట్‌ చేస్తున్నామని, పొడి చెత్త ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. తడి చెత్త ద్వారా రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
దేశంలో 3శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ అవార్డుల్లో 30శాతం సాధించిందన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 150 వార్డు కార్యాలయాలు అమలులోకి వస్తాయన్నారు. వార్డు కార్యాలయాల్లో అన్ని శాఖలకు చెందిన 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అధికారి వార్డ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని, ఈ అధికారి పర్యవేక్షణలో పారిశుధ్యం, రోడ్డు మెయింటెనెన్స్‌, ఇంజినీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, ఎంటమాలజీ, యూబీడీ, యూసీడీ, జలమండలి, విద్యుత్‌, తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు. ఆ వార్డు నా పరిధి కాదని ఎవరూ చెప్పొద్దనీ, వచ్చిన ప్రతి ఫిర్యాదునూ స్వీకరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగాగానీ సోషల్‌ మీడియా, ట్విట్టర్‌, ఇంస్టాగ్రామ్‌లో లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా స్పందించాలని, నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కరమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులకు వాటి పరిష్కార వివరాలను తెలియజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా గార్బేజ్‌, స్ట్రీట్‌ లైట్‌, వాటర్‌ లీకేజీలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అధికంగా వచ్చే అవకాశముందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయో దృష్టి సారించాలన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం నగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా సమస్యల సత్వర పరిష్కారానికి ఈ వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ వార్డు వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డు కార్యాలయాలకు 1000 చదరపు గజాలలో ఓకే విధమైన రూల్స్‌తో వార్డు వ్యవస్థను నెలకొల్పామన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా 1000 చదరపు అడుగులున్న భవనాలను గుర్తించి సిద్ధం చేసిననట్టు తెలిపారు. వార్డు కార్యాలయంలో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వార్డు పరిపాలన అధికారిగా వార్డులో నియమించిన వివిధ విభాగాల సిబ్బందికి అస్కి ద్వారా శిక్షణ అందించామన్నారు. సీడీఎంఏ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలు పరిపాలనకు చేరువ కావడానికి జిల్లాలు, మండలాలు, ఆర్డీవో కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వార్డు అధికారులు ప్రభుత్వానికి కండ్లు, చెవులు వంటి వారు అన్నారు. జలమండలి ఏం.డీి దానకిషోర్‌, టీఎస్‌ఎప్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఇంజినీరింగ్‌ చీఫ్‌ జియావుద్దీన్‌ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా అడ్వాన్స్‌ ప్లానింగ్‌ ద్వారా మైనర్‌ వర్క్స్‌, ప్యాచ్‌ వర్క్స్‌, క్యాచ్‌ పిట్‌ వర్క్స్‌ 24గంటల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరారు. విపత్తు సమయంలో మాన్సూన్‌ రెస్క్యూటీమ్‌లు వేగవంతంగా పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు అధికారులు, సిబ్బంది, విద్యుత్‌, జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.