జనగామలో అడుగు పెట్టొద్దు..

– ప్రకటన వచ్చేంత వరకూ అటు వైపు చూడొద్దు…
– ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి కేటీఆర్‌ వార్నింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జనగామ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగు పెట్టొద్దంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌… ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు. టిక్కెట్‌పై ప్రకటన వెలువడేంతవరకూ అటు వైపు కూడా చూడొద్దంటూ ఆయన హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో జనగామ పేరు లేని సంగతి విదితమే. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కాకుండా కొత్త వారికి టిక్కెట్‌ ఇస్తారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈసారి కూడా తనకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ ముత్తిరెడ్డి… రకరకాల రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆ సీటుపై కన్నేసిన పల్లా రాజేశ్వరరెడ్డి… ఇప్పటికే అక్కడ రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని రెండు మండలాలకు చెందిన నేతలతో పల్లా వరస భేటీలు, చర్చలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్‌ ఆయనపై సీరియస్‌ అయినట్టు సమాచారం. జనగామపై సీఎం కేసీఆర్‌ ప్రకటన వెలువరించేంత వరకూ అటు వైపే వెళ్లొద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా కేటీఆర్‌ అనుచరుడు, సన్నిహితుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడి నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు అన్ని రకాలుగా కేటీఆర్‌ అండదండలున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
మైనంపల్లి స్థానంలో మర్రి…?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ మారే విషయమై బలమైన సంకేతాలున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి టిక్కెట్టు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ అధిష్టానం యోచిస్తోంది. అయితే స్థానిక నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. మైనంపల్లిని ఢ కొట్టేందుకు మర్రి శక్తి సామర్థ్యాలు సరిపోవని వారు భావిస్తున్నారు. ‘వీలైతే మైనంపల్లిని బుజ్జగించండి.. లేదంటే సమర్థులైన అభ్యర్థులను చూసి పోటీలో నిలబెట్టండి, అంతేతప్ప మర్రికి మాత్రం టిక్కెట్‌ ఇవ్వొద్దు…’ అని బీఆర్‌ఎస్‌ లోకల్‌ లీడర్లు తేల్చి చెప్పినట్టు సమాచారం.