స్వీపర్ల కష్టాన్ని గుర్తించరా?

Don't recognize the difficulty of sweepers?– కనీస వేతనం ఇవ్వాల్సిందే.. లేదంటే ప్రగతి భవన్‌ ముట్టడే..
– పంచాయతీరాజ్‌ కార్యాలయం ముందు ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల కష్టాన్ని పట్టించుకునేందుకు ఈ సర్కారుకు తీరిక లేదా? బండచాకిరి చేస్తున్న శ్రమజీవుల బాధల్ని ఎందుకు అర్థం చేసుకోదు? బడుగులంటే ఈ ప్రభుత్వానికి అంత చులకనా? అంటూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున స్వీపర్లు కదిలి వచ్చారు. ”స్కూల్‌ స్వీపర్లందరినీ బేషరతుగా పుల్‌ టైం స్వీపర్లుగా గుర్తించి రెగ్యులర్‌ చేయాలి”. ‘కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి’.’1993 కటాఫ్‌ డేట్‌ను ఎత్తేసి పనిచేస్తున్న స్కూల్‌ స్వీపర్లందరినీ పర్మినెంట్‌ చేయాలి’. ‘స్వీపర్లను నిర్లక్ష్యం చేస్తే..తగిన మూల్యం తప్పదు’. ‘కేసీఆర్‌ సారూ…మాకు న్యాయం చేయండీ’. ‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలే’.. అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ 30,40 ఏండ్ల నుంచి స్వీపర్లుగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయకుండా వారితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయనీ, జీతాలు పెరుగుతాయనీ వారు ఆశపడ్డారని గుర్తు చేశారు. కానీ.. వారి ఆశలు నిరాశలయ్యాయనీ, కల్లబొల్లి మాటలతో ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో పాటు వైద్యం, విద్య, ఇతర ఖర్చులు, అవసరాలన్నీ రూ.1,623తో ఎలా తీరుతాయని ప్రశ్నించారు. బడుగులతో కష్టం చేయించుకుంటున్న ఈ ప్రభుత్వం, శ్రమదోపిడికి పాల్పడుతున్నదని విమర్శించారు. సీఎం, మంత్రు లు, ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచుకున్నప్పుడు స్వీపర్ల కడుపాకలి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బడుగులంటే ఈ సర్కారుకు ఏ పాటి ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పారు. 75 రోజులుగా సమ్మె చేస్తుంటే..పాలకుల చెవులకు స్వీపర్ల నినాదాల గోస ఎందుకు వినిపించటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకపోతే..రాబోయే కాలంలో ప్రగతి భవన్‌ ముట్టడించక తప్పదని హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో 3,200మంది స్వీపర్లు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ తరగతులకు చెందిన వారన్నారు. ఉదయం 7గంటలనుంచి సాయంత్రం వరకు గంట కొట్టే దగ్గరనుంచి బాత్రూంలు శుభ్రం చేసే వరకు అన్ని పనులు వీరే చేయాలని చెప్పారు. 60ఏండ్ల పైబడిన వారిని రిటైర్మెంట్‌ చేస్తే వారికి రూ.15లక్షల రిటైర్‌మెంట్‌ బెనిపిట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం స్వీపర్ల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాటల సోమన్న, జ్యోతి, సత్తయ్య, ఆర్‌ శ్రీనివాస్‌, సందీప్‌, స్వీపర్ల రాష్ట్ర నాయకులు కె యాదగిరి, ఏలేటి శంకర్‌, పి నర్సింహాగౌడ్‌, రాజ్‌ మహామ్మద్‌, గాదె చంద్రయ్య, హుస్సేన్‌, పరుష రాములు, యాదగిరి గౌడ్‌, రాజ మల్లయ్య, స్వామి, పూలమ్మ, సత్తెన్న తదితరులు పాల్గొన్నారు.