అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి

– సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్
నవతెలంగాణ – కంటేశ్వర్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగినా నిరుపేదల విస్తృత సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలం పైగా నగరంలోని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఇవ్వకపోవడంతో పేదలు ఇంటి అద్దెలను భరించలేక ఆర్థిక ఇబ్బందులతో అర్ధాకలితో జీవిస్తున్నారని, నగరం పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనవంతులు ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని వాటిని పేదలకు పంచి ఇండ్ల నిర్మాణం కొరకు రుణాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరింత కాలయాపన చేస్తే ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలు భూ పోరాటానికి సిద్ధపడతారని అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య పోరాటాల ద్వారా మాత్రమే హక్కులను సాధించుకోవచ్చు అని అందుకు పేదలంతా ఐక్యంగా తమ హక్కుల కోసం జరిగే పోరాటాల్లో కదిలి రావాలని ప్రభుత్వ భూములను పేదలకు దక్కే వరకు పోరాటాలకు సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పి సూరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోవర్ధన్ నగర కమిటీ సభ్యులు సుజాత, కృష్ణ, కే రాములు, అబ్దుల్, నరసయ్య తదితరులతోపాటు పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు.