అనుమానమే అసలు సమస్య

అనుమానం ఎంతటి గొప్ప అనుబంధాన్నైనా విచ్ఛిన్నం చేయడం ఖాయం. ఒక్కసారి అది మెదడులోకి దూరిందా… ఇక దాని నుండి బయట పడడం చాలా కష్టం. అంతటి భయంకరమైన అనుమానం వల్ల ఇద్దరి జీవితాలే కాదు కుటుంబాలే నాశనం అవుతాయి. అలాంటి సమస్యతోనే అనిత ఇబ్బంది పడతుంది. తన వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతుంది. అసలు ఆమె సమస్య ఏంటో, దాని నుండి ఎలా బయటపడిందో ఈవారం ఐద్వా అదాలత్‌లో తెలుసుకుందాం.

రాహుల్‌కు 42 ఏండ్లు ఉంటాయి. మా ఆఫీసు లోపలికి వస్తూనే ‘ఇక్కడ మహిళలకు మాత్రమే న్యాయం చేస్తారా? పురుషులకు కూడా న్యాయం చేస్తారా? మీరు నా సమస్యకు పరిష్కారం చూపించగలరా’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అతని ఆవేదన అర్థం చేసుకున్న మేము ‘ముందు మీ సమస్య ఏంటో చెప్పండి’ అని ప్రశాంతంగా అడిగితే…
నాకు ఒక షాప్‌ ఉంది. అందులో పాలు, పెరుగు, నెయ్యితో పాటు పాలతో తయారైన ఉత్పత్తులు అమ్ముతుంటాము. షాపులో నాతో పాటు ఇంకో పది మంది వర్కర్లు ఉంటారు. నా భార్య అనిత. అయితే అనితతో నాది రెండో వివాహం. ఒక కొడుకు పుట్టిన తర్వాత నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. అనితకు కూడా అంతకు ముందే పెండ్లయింది. ఒక పాప వుంది. తను ఐదేండ్ల కిందట మా షాపులో పనికి చేరింది. మా ఇద్దరికీ నచ్చి పెండ్లి చేసుకున్నాం. ఇప్పటికి మా పెండ్లయి 15 ఏండ్లు అయ్యింది.
పెండ్లప్పుడే నేను అనితతో ‘మనిద్దరం పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలి. నీ బాబు, నా పాప అని కాకుండా బాబును నువ్వు సొంత తల్లిలా చూసుకోవాలి, నేను పాపను సొంత తండ్రిలా చూసుకుంటాను. వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి బేధం చూపించకూడదు. పిల్లలు చిన్నవారు కాబట్టి ఇప్పటి నుండే వారిద్దరు సొంత అన్నాచెల్లిగా ఉండేలా చూసుకుందాం’ అని చెప్పాను. దానికి అనిత కూడా ఒప్పుకుంది.
ఏడాది వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత అనిత ‘నాకు ఒక కొడుకు కావాలి. మనకు ఓ అబ్బాయి ఉంటే బాగుంటుంది’ అంది. దానికి నేను ‘మనకు పాప, బాబు ఇద్దరూ ఉన్నారు. ఇక పిల్లలు వద్దు, పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించుకో. నువ్వు చేయించుకోకపోతే నేనే చేయించుకుంటాను’ అని కచ్చితంగా చెప్పాను. అనిత కూడా దానికి సరే అంది. కానీ బాబును బాగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. నేను ఇంట్లో లేనప్పుడు బాబును కొట్టడం, అన్నం పెట్టకపోవడం ‘ఇంట్లో నుండి వెళ్ళిపో, నీ వల్ల మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం’ అంటూ తిట్టేది.
ఈ విషయాలన్నీ బాబు నాకు చెప్పుకొని చాలా బాధపడేవాడు. దాంతో నేను అనితతో ‘ఎందుకలా ప్రవర్తిస్తున్నావు, బాబుతో నీకేంటి ఇబ్బంది. నేను పాపను బాగానే చూసుకుంటున్నాను కదా! మంచి స్కూల్‌లో చేర్పించాను. తన పేరు మీద పొలం కొన్నాను. ఐదు తులాల వరకు బంగారం కూడా కొన్నాను. పాపకు నేనేం తక్కువ చేశాను’ అని అడిగాను. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. దాంతో బాబును నేను హాస్టల్లో చేర్పించాను. ఇంట్లో పరిస్థితి నచ్చకపోవడంతో వాడు కూడా హాస్టల్లో వుండేందుకు సిద్ధపడ్డాడు. సెలవులు వచ్చినపుడు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. అయినా అనిత బాబును ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకునేది కాదు.
బాబు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు నాతో పాటు షాప్‌లో కూర్చుంటాడు. నా పనిలో సాయం చేస్తున్నాడు. బాబు ఇంత పెద్దవాడు అయినా అనిత ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు. ఎప్పుడూ తిడుతూ వాడి స్నేహితుల ముందే అవమానిస్తుంది. ఎలా పడితే అలా మాట్లాడుతుంది. పిల్లలిద్దరూ ప్రేమగా ఉన్నా భరించలేదు. పాపను బాబుతో అస్సలు మాట్లాడనివ్వదు.
ఇప్పుడు బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోతా అంటున్నాడు. అమ్మా, చెల్లితో నువ్వు సంతోషంగా ఉండు. నేను వేరేగా ఉంటాను అంటున్నాడు. అనితకు, ఆమె పాపకు మంచి జీవితం ఇవ్వాలని, నా కొడుక్కి ఓ తల్లి దొరుకుతుందని ఆమెను పెండ్లి చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా నా బాబును నా నుండి దూరం చేస్తుంది. నా సమస్యకు పరిష్కారం చూపించండి’ అంటూ బాధ పడ్డాడు.
మేము అనితకు ఫోన్‌ చేసి పిలిపించి ‘రాహుల్‌ ఎప్పుడైనా పాపను పరాయిదానిలా చూశాడా’ అని అడిగితే ‘ఆయన నన్నూ, పాపను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా చూసుకుంటాడు. మా పాప పేరుతో పొలం, ఎల్‌ఐసీ, బంగారం కూడా కొన్నాడు. బాబు కూడా పాపను బాగానే చూసుకుంటాడు. పాప కూడా నాతో కంటే వాళ్ళతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది.
నా కూతురు నన్ను కాదని వాళ్ళతోనే ఉంటే నా పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతాను. పాప కూడా బాబు ఎలా చెబితే అలా వింటుంది. తనకు ఏం కావాలన్నా వాడే తీసుకొస్తాడు. రాహుల్‌ కూడా బాబు కంటే పాపనే బాగా చూసుకుంటాడు. అయినా నాకు ఎక్కడో అనుమానం. సొంత వాళ్ళు కాకపోయినా ఇంత ప్రేమగా ఉంటున్నారు. చివరకు నా పాపకు ప్రేమ మాత్రమే మిగిల్చి ఆస్థి ఇవ్వరేమో అని అనుమానం. ఆ భయంతోనే బాబును తిడుతుంటాను’ అన్నది.
ఆమె మనులో ఉన్న అనుమానాలను రాహుల్‌కు, బాబుకు చెబితే ‘నేను చిన్నప్పటి నుండి ఎప్పుడూ వాళ్ళను వేరుగా చూడలేదు. తనను నా సొంత తల్లిలాగే అనుకున్నాను. నా చెల్లికి ఆస్థి ఇవ్వకుండా ఎందుకు ఉంటాను. తనను అమ్మ నుండి ఎందుకు దూరం చేస్తాము. అందరం కలిసి హాయిగా ఉండాలని నా కోరిక. నేను అమ్మను, చెల్లిని ఎప్పుడూ పరాయి వాళ్ళని అనుకోలేదు. అస్తి రాసి ఇస్తే అమ్మకు నమ్మకం వుంటుందంటే మేము ఇప్పుడే ఆస్తి మొత్తం చెల్లికి రాసి ఇస్తాం’ అన్నాడు ఆ బాబు.
ఇదంతా వింటున్న అనిత నోరు విప్పలేక పోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో మేము ‘అనిత నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములే చెల్లెళ్ళను పట్టించుకోవడం లేదు. అలాంటిది ఈ అబ్బాయి నీ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ విషయం నీకూ తెలుసు. ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉండడం నీకు దొరికిన మంచి అవకాశం. లేని పోని అనుమానాలతో నిన్ను ప్రేమించే వాళ్ళను దూరం చేసుకోకు’ అని నచ్చజెప్పాము. అలా వరుసగా 12 వారాల పాటు మా ఆఫీసుకు పిలిచి ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చాము. ఇప్పుడు అనితలో చాలా మార్పు వచ్చింది. ‘మేడమ్‌ ఇన్ని రోజులు బాబును అనవసరంగా ఇబ్బంది పెట్టాను. నా ప్రవర్తనతో ఆయన్ని కూడా చాలా బాధపెట్టాను. ఇక నుండి బాబును మంచిగా చూసుకుంటాను. ఇన్ని రోజులు నేను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటాను’ అన్నది. రాహుల్‌ కూడా భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా తన ఆస్తి మొత్తం రెండు భాగాలు చేసి పాపకు, బాబుకు వచ్చేలా వీలునామా రాయించాడు.
– వై. వరలక్ష్మి, 9948794051