– క్యూ1లో రూ.2,870 కోట్ల లాభాలు
బెంగళూరు:టెక్ దిగ్గజం విప్రోలో వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఉద్యోగుల్లో తగ్గుదల చోటు చేసుకుంది. 2023 జూన్‌తో ముగిసిన త్రై మాసికంలో 8,812 ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం నికర ఉద్యోగుల సంఖ్య 2,49,758కి తగ్గింది. కాగా.. గతేడాది ఇదే సమయంలో మాత్రం 15,446 కొత్త ఉద్యోగులను చేర్చుకుంది. 2023 మార్చి త్రైమాసికంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,56,921కి పడిపోయింది. కాగా.. గడిచిన త్రైమాసికంలో మరో ప్రధాన పోటీదారు టిసిఎస్ నికరంగా 523 మందిని, హెచ్‌సిఎల్ టెక్నలాజీస్ 2,500 మందిని జోడించింది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న అజీం ప్రేమ్‌జీకి చెందిన విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన ప్రథమ త్రైమాసికం (క్యూ1) లో లాభాల ఆర్జనలో మార్కెట్ అంచనాలను చేరలేకపోయింది. గడి చిన క్యూ1లో 11.9 శాతం వృద్థితో రూ.2,870 కోట్ల లాభాలు నమోదు చేసిం ది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,563 కోట్ల లాభాలు ప్రకటించింది. క్రితం క్యూ1లో రూ.3000 కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేయగా.. విప్రో చేరలేకపోయింది. క్రితం క్యూ1లో కంపెనీ రెవెన్యూ 6 శాతం పెరిగి రూ.22,831 కోట్లుగా చోటు చేసుకుంది. గడిచిన త్రైమాసికంలో కంపెనీ పెద్ద క్లయింట్లను సాధించినట్లు విప్రో సిఇఒ, ఎండి తియెరి డెలపోర్ట్ తెలిపారు. 3.7 బిలియన్ డాలర్ల బుకింగ్స్‌ను నమోదు చేయగా.. ఇందులో పెద్ద ఒప్పందాల విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు.