వందలాది భాషలు, భిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో ఒక భాషా సాహిత్య సంస్కృతులు మరో భాషీయులకు చేరువయ్యేందుకు ఆదాన ప్రధానాలు తొలినాళ్ళ నుండి తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుదైన పనిగా, సంస్కృతం, ఉర్దూ, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో సమానంగా పనిచేస్తున్న వారిలో డా||షేక్ అబ్దుల్ ఘనీ కనిపిస్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 10 ఆగస్టు, 1972 న జన్మించారు డా||షేక్ అబ్దుల్ ఘనీ. శ్రీమతి బీపాషా బేగం, శ్రీ శహబోద్దీన్ తల్లిదండ్రులు. అయిదు భాషల్లో అరుదైన పని చేస్తున్న రచయిత, అనువాదకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి చేసిన ఉర్దూ మాతృభాషీయుడు. హిందీ, ఉర్దూల్లోనూ ఎం.ఎ చేశారు. ఇంగ్లీష్, తెలుగుల్లో చేస్తున్నారు. ‘ముస్లిం కవులు సంస్కృత సాహిత్యానికి చేసిన సేవ’ అంశంపై పిహెచ్.డి చేశారు. సంస్కృతంలో భాసుడు రాసిన ‘కర్ణభారం’ను ఉర్దూలోకి అనువాదం చేశారు. సంస్కృత సాహిత్య చరిత్రను ‘తారిఖ్ సంస్కృత్ అదబ్-1’ పేరుతో ఉర్దూలోకి తెచ్చారు.
కేవలం సాహిత్యానువాదం, రచనలతో సరిపెట్టుకోలేదు ఘనీ. ‘సంస్కృత్ అవుర్ ఉర్దూకే లిసానీ వ అదబీ రవాబిత్ వ తహజీబ్ హమ్ ఆహంగే’ పేర ఉర్దూ భాషపై సంస్కృతం ప్రభావాన్ని శాస్త్రీయంగా చూపించారు. ‘దకనీ జుబాన్-వ-అదబ్‌కే సంస్కృత్ అనాసిర్’ కూడా ఈ కోవలోనిదే. కేవలం ఉర్దూలోనే కాక హిందీ లోనూ తన పరిశోధనా గ్రంథాలను వెలవరించిన ఘనీ 5వ శతాబ్ధికి చెందిన భర్తృహరి, 16వ శతాబ్ధికి చెందిన హిందీ కవి అబ్దుల్ రహీం ఖానాల కావ్యాలపై తులనాత్మక అధ్యయనం చేశారు. హిందీ అనువాదాలలో ఉర్దూ భాష ప్రభావం, హిందీ తెలుగు సమాన ఉచ్ఛారణా శబ్ధాలు, భగవద్గీత తెలుగు అనువాదాలు వంటి వాటిపై పరిశోధన చేసి ‘భాషాయి ఆధార్-వివిధ్ స్వర్’ పేరుతో హిందీలో ప్రచురించారు. తెలంగాణ ప్రాచ్య లిఖిత భాండాగారంలో సంస్కృత రీసెర్చ్ అసిస్టెంట్‌గా వున్న వీరు అనువాదాలతో పాటు మౌలిక రచనలు చేశారు. జానపద సాహిత్యంలో పరిశోధనా పత్రాలను తన సంపాదకత్వంలో ప్రచురించారు. రాజా గిరిధారి ప్రసాద్ బాఖీ ఉర్దూ ‘శివ పురాణ్”ను సంస్కరించారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని యాభైకి పైగా పరిశోధనా పత్రాలు హిందీ, ఉర్దూ, సంస్కృత, దకనీ భాషలపై సమర్పించారు. సాహిత్యంతోనే కాదు వివిధ సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయనది అంతే భాగస్వామ్యం. అందులో భాగంగా తాను పుట్టిన ఊరిలో ఉర్దూ అభ్యసిస్తున్న ఆర్థికంగా వెనకబడిన పిల్లలకు తమ సంస్థ మైనారిటీ డెవలప్‌మెంట్ కమిటి ద్వారా తన టీంతో కలిసి ప్రతి యేడు జాతీయ విద్యా దినోత్సవం రోజు వారికి పుస్తకాలు, బ్యాగులను అందిస్తారు.
రెండు రాష్ట్రాల హిందీ పాఠ్యపుస్తక రచనల్లో రచయితగా పాల్గొన్న వీరు అయిదు భాషల్లో 50 పుస్తకాలు రాయగా వాటిలో 25 బాల సాహిత్యమే కావడం విశేషం. వీటిలో మౌలిక రచనలతో పాటు అనువాదాలున్నాయి. మణికొండ వేదకుమార్ సారధ్యంలో బాల చెలిమి తెచ్చిన తెలంగాణ బడి పిల్లల కథలను, రంగినేని ట్రస్ట్‌వారి కథా సరితను హిందీ, ఉర్దూల్లో అనువాదం చేశారు. డా. సిరి ‘అక్షరాలతో ఆట’ను ఉర్దూలోకి, పత్తిపాక మోహన్ ‘ఆకుపచ్చని పాట’ను ‘హరేబరే గీత్’గా, గరిపెల్లి అశోక్ ఎంకటి కతలను ‘కట్టీమీటి గోలియా’గా హిందీ లోకి తెచ్చారు. నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘ఎవరు పెద్ద మూర్ఖుడు’, ‘బంగారుశిల’లు అనువాదం చేశారు. ‘భువనగిరి వెలుగులు’ పిల్లల కథల పుస్తకంకు సంపాదకత్వం వహించి ప్రచురించారు. ‘బచ్చోంకీ దునియా’గా బాల గీతాలను హిందీలో తెచ్చారు. పిల్లల కోసం ‘రూమీ కథలు’ సంకలనం చేశారు.
పిల్లల కోసం ‘మౌలానా ఆజాద్’, ‘బాపు (గాంధీజీ)ల కథలను ఆంగ్లంలో రాసారు. రంగుల్లో పంచతంత్ర కథలను సంస్కృతంలో పుస్తకంగా తెచ్చారు. తెలుగు బాల సాహిత్యకారునిగా ‘ఈశాన్య రాష్ట్రాల జానపద కథలు’ పుస్తకంగా తెచ్చిన ఘనీ, అక్కడి భాష, సంస్కృతులను తెలుగు పిల్లలకు పరిచయం చేయడంలో సఫలం అయ్యారు. ముఖ్యంగా ఇందులోని ‘జింక-నత్త’, ‘రాజు-బోయవాడు’, ‘తెలివైన మాచె’, ‘వారసుడు’ వంటి కథలు చక్కని హాస్యంతో పాటు ఆసక్తిని కలిగిస్తాయి. అరుణాచల్, అసోమ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర మిజోరాం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల బోడో, ఖాసి, కోక్‌బోరా వంటి భాషా సాహిత్యాల కథలివి. వాటిని తెలుగు పిల్లల కోసం తెలుగు సంస్కృతికి దగ్గరగా తెచ్చి రాశారు రచయిత. ఇదే కాక తెలుగులో ఘనీ రాసిన మరో పుస్తకం ‘రహీం కే దోహే’. ఇది హిందీ, ఉర్దూ కవి రహీం రాసిన దోహాల సరళ తెలుగు పుస్తకం. చిన్న పుస్తకంగా ప్రచురించి బడి పిల్లలకు దీనిని ఆయన ఉచితంగా అందించారు. మూల భాషలోని దోహాతో పాటు తెలుగు అనువాదాన్ని సరళ భాషలో పిల్లల కోసం అందించారు. సాహిత్య కృషికి అనేక పురస్కారాలు అందుకున్న ఘనీ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ సాహిత్య పురస్కారం, ఉత్తరప్రదేశ్ రాజ్య సాహిత్య సంస్థాన్ హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ వికాసానికిచ్చే లక్ష రూపాయల పురస్కారాన్ని గెలుచుకున్నారు.
– డా|| పత్తిపాక మోహన్
9966229548