
నవతెలంగాణ- కంటేశ్వర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా డా. మధు శేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై డా. మధు శేఖర్ కు శుభాకాంక్షలు గురువారం తెలియజేశారు.ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ…వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిటేన డా. మధు శేఖర్ గారిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఛైర్పర్సన్ గా ముఖ్యమంత్రి కేసిఆర్ నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు అత్యంత అప్తుడైన డా. మధు శేఖర్ గారికి ప్రతిష్టాత్మక పదవి రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటున్న ఇన్స్టిట్యూట్ ని కార్పొరేషన్ గా మార్చి తొలి చైర్మన్ గా డాక్టర్ మధుశేఖర్ని సీఎం కేసిఆర్ నియమించడం జరిగిందన్నారు. వారు చేపట్టిన పదవికి తనదైన శైలి పనితీరుతో సరికొత్త వన్నె తేవాలని సూచించారు. సీఎం కేసిఆర్ గారికి ఈ సందర్బంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఛైర్పర్సన్ తో సహా మొత్తం 13 మందితో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ బోర్డ్ లో హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్ గా ,డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్,నిమ్స్ డైరెక్టర్ ఫైనాన్స్ సెక్రటరీ తదితరులు సభ్యులుగా ఉంటారు.
వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రత్యేక ప్రజారోగ్యం, వైద్య రంగంలో వివిధ అధ్యయనాలను చేపట్టేందుకు పరిశోధనా సంస్థగా పనిచేయనుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి,క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు, మహిళా సాధికారత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత,మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ విఠల్ రావు,గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్,పలువురు నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.