గ్లకోమా వ్యాధి పట్ల అప్రమత్తత అవసరం: డాక్టర్‌ రాజలింగం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాశ్వత అంధత్వానికి దారి తీసే గ్లకోమా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సరోజినీ దేవి కంటి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆస్పత్రి ప్రాంగణంలో గ్లకోమా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందితో పాటు నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రుల నుంచి వచ్చిన నర్సింగ్‌ విద్యార్థులు తదితరులు ప్ల కార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. గ్లకోమా వ్యాధి అంటే ఏమిటీ? దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అనంతరం రాజలింగం మాట్లాడుతూ 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు ఏడాదికి ఒకసారి గ్లకోమా పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ థియేటర్‌ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మోదినీ, కార్నియా విభాగం అధిపతి డాక్టర్‌ కేశవ రావు, గ్లకోమా విభాగం డాక్టర్‌ సుపర్ణ తదితరులు పాల్గొన్నారు.