– సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులు వేగవంతం
– మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలను రక్షించడానికి
– డ్రోన్ సర్వే సాయం : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓల్డ్ సిటీ మెట్రో రైలు పనుల కోసం డ్రోన్ సర్వేను హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులు, తదితరాలపై డ్రోన్ సర్వేను ప్రారంభించినట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంప్రదాయక సర్వేతో పాటు, దారుల్-షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మధ్య ఇరుకైన మార్గంలో రహదారి విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి డ్రోన్ సర్వే చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాల రక్షణ మెట్రో నిర్మాణానికి ప్రధాన సవాలుగా ఉన్నాయని, వాటిని రక్షించడానికి తగిన ఇంజనీరింగ్ పరిష్కారాలను రూపొందించడంలో డ్రోన్ సర్వే సహాయపడుతుందని పేర్కొన్నారు. మెట్రో అలైన్‌మెంట్, పిల్లర్ లొకేషన్లు ఈ నిర్మాణాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, 3డీ మోడలింగ్, జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డేటా, క్యాడ్ సాఫ్ట్‌వేర్ ఏకీకరణ, డేటా విశ్లేషణ విజువలైజేషన్‌ను త్వరితగతిన సేకరించవచ్చని తెలిపారు. మరికొద్దిరోజుల్లోనే భూసామర్థ్య పరీక్షలు ప్రారంభించడానికి టెండర్లు కూడా ఖరారు చేస్తామని పేర్కొన్నారు.