– డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)కి దరఖాస్తు చేసే గడువును వారం రోజులు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సవరణకు అవకాశం కల్పించాలని విద్యాశాఖను కోరారు. ఈనెల 20 వరకు పరీక్ష ఫీజు, 21 వరకు దరఖాస్తు సమర్పణకు గడువుందని తెలిపారు. సాంకేతికపరమైన సమస్యలు రావడం, ఇతర తప్పులతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. డీఎస్సీ వెబ్‌సైట్ సర్వర్ డౌన్ కావడం వల్ల ఇప్పటి వరకు లక్ష మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయలేదని వివరించారు. మరో లక్ష మందికిపై అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉందని తెలిపారు. అందుకే దరఖాస్తు గడువును పెంచడంతోపాటు సవరణకు అవకాశం కల్పించాలని కోరారు. రాతపరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చేనెల 20 నుంచి 30 వరకు నిర్వహించాలనుకున్న డీఎస్సీ రాతపరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసిన విషయం తెలిసిందే. 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతనెల ఎనిమిదో తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.