నూతన ప్రభుత్వానికి డీవైఎఫ్‌ఐ అభినందనలు

నూతన ప్రభుత్వానికి డీవైఎఫ్‌ఐ అభినందనలు– యువత ఆకాంక్షలకనుగుణంగా నియామకాలు చేపట్టాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుద్యోగులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ప్రకటించిన మాదిరిగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి అతిత్వరలోనే చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల ముందు వాయిదా పడిన గ్రూప్‌-2, డీఎస్సీ పోటీపరీక్షలను సత్వరమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. నోటిఫికేషన్లు ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. విద్యావైద్యం, ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనకు కృషి చేయాలని సూచించారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఉద్యమాలను చేపడతామని స్పష్టం చేశారు.