– ఫ్రీగా ఇస్తున్నాం :సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లో ఒక్కో డబుల్‌బెడ్‌రూం ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.50 లక్షలు విలువచేస్తుందనీ, దాన్ని పేదలకు ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇస్తున్నదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కార్యలయంలో జరిగిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్మాణం చేస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విలువ రూ.9,100 కోట్లు అనీ, కానీ మార్కెట్ విలువ రూ.50వేల కోట్లకు పైగానే ఉంటుందన్నారు. మొదటి దశలో 11,700 ఇండ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించామనీ, ఈనెల 21న రెండవ దశలో దాదాపు 13,300 ఇండ్లను ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో పారదర్శకంగా కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేననీ, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసి వేసే స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పులు చేయాలని మంత్రులు ముఖ్యమంత్రిని కోరారనీ, ఆ సూచనలకు సీఎం సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయన్నారు. 58, 59 జీవోల ద్వారా ప్రజలకు ఉపశమనం లభించిందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.