వ్యవ సాయం తప్పదు

– వారం రోజుల్లోనే ఏడాది వర్షపాతం… మూడోసారి విత్తాల్సిందే
– వరదల నివారణ శాస్త్రీయంగా జరగాలి… భారీగా పంట నష్టం
– వ్యవసాయ, సాగునీటి రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి
‘ఏడాది వర్షపాతం వారం రోజుల్లోనే పడింది.. వరద నివారణ చర్యలు శాస్త్రీయంగా చేపట్టాలి.. రైతులు మూడోసారి విత్తనాలు వేయాల్సిందే.. మళ్లీ వానలొస్తే వానాకాలం సీజన్‌ పోయినట్టే.. భారీగా పంటలనష్టం ఉండే అవకాశం.. గణాంకాలు సేకరించి రైతులకు సాయం చేయాల్సిన అవసరం ఉందని’ ప్రముఖ వ్యవసాయ, సాగునీటి రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. వెంటనే వర్షాలు, వరద కష్టాలు, నష్టాల నుంచి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల నిర్వహణ, పంటల సాగు, నష్టం, సర్కారు సాయానికి సంబంధించి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివి..
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయం పరిస్థితి ఎలా ఉందంటారు ?
62 లక్షల ఎకరాల విస్తీర్ణానికిగాను 52 శాతమే సాగైంది. అతివృష్టి, అనావృష్టిని తలపించేలా వర్షాల పరిస్థితి ఉంది. తాజా వానలు 30 నుంచి 40ఏండ్లల్లో ఎప్పుడూ లేదు. వారం రోజుల్లోనే ఏడాది మొత్తం పడాల్సిన వర్షం వచ్చింది. మిల్లీమీటర్ల లెక్కపోయింది. ఇప్పుడు సెంటిమీటర్లల్లో లెక్కించాల్సి వస్తున్నది. పదుల సంఖ్యలో జనం చనిపోయారు. రైతులు రెండుసార్లు ఇప్పటికే విత్తనాలు వేశారు. భారీ వానలతో మూడోసారీ విత్తాల్సి రావచ్చు. వరదనీటి ప్రవాహానికి దారి చూపించే వ్యవస్థ లేదు. ప్రాజెక్టుల గేట్ల నిర్వహణా దారుణంగా ఉంది. ఉన్న నీటిని క్రమపద్దతిలో బయటకు పంపిస్తే సమస్యలే రావు.
వరదల నివారణకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?
భారీ వర్షాలతో వరదలు రాగానే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు, సిబ్బందిని పంపించి ప్రభుత్వాలు చేతులు దులుపేసుకుంటున్నాయి. మంత్రులు, కార్యదర్శులు వెళ్లి కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. అలా కాకుండా నిధులు, వనరులు అందుబాటులోకి తేవాలి. ఆదేశాల అమలుకు ప్రయత్నించాలి. బాధితులను ఆదుకోవాలి. ఆహారం, వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలి. సాంకేతిక అభివృద్ధి జరిగినా, 17 మంది చనిపోవడం ఆవేదన కలిగించేదే. ఇది ప్రభుత్వ అలక్ష్యమే తప్ప, మరోకటికాదు. జపాన్‌లాంటి దేశంలో భారీ వరదలు, భూకంపాలు వచ్చినా మృతుల సంఖ్య ఇంతలా ఉండదు. సర్కారుతోపాటు ప్రజలూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రాణ, ఆస్థినష్టం తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరదల కారణంగా 10 లక్షల ఎకరాలకుపైనే పంట నష్టం జరిగింది. వీటిపై అధ్యయనం చేసి, బాధిత రైతులకు సాయం చేసి వారిని నిలబెట్టాలి.
ఇంకా ఏంచేయాలి ?
అత్యవసర నిధులు విడుదల చేయాలి. కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్‌, సాగునీటి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలి. నిర్వాసితులను ఆదుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. వరదల పట్ల ప్రజలు, రైతుల్లో ఎప్పటికప్పుడు చైతన్యం కల్పించాలి.
అప్రమత్తత అంటే ?
ప్రాజెక్టులతోపాటు ఇతర నీటి వనరుల్లో వాతావరణ శాఖ సలహాలు, సూచనల మేరకు నీటి నిల్వలను తగ్గించాలి. దురాక్రమణకు గురైన నదులు, కాలువలు, ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని నీరువెళ్లే మార్గాలను నిర్మిం చాలి. ఎక్కడిక్కడ సరఫరాకు తగిన షెడ్లను ఏర్పాటు చేయాలి. బస్తీ, గ్రామ దవాఖానాల్లో సిబ్బంధి, మందులను విస్త్రృతంగా స్టాక్‌ చేయాలి. ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజనులను వరద కష్టాలు, నష్టాల నుంచి రక్షించాలి.
వ్యవసాయానికి కావాల్సిన సహాయమేంటి ?
తొలుత తొలకరి ఆలస్యం కావడంతో వానాకాలం పంటల సాగు ఆలస్యమైంది. దింతో ఇప్పటికే రైతులు రెండుసార్లు విత్తారు. ఇప్పటి భారీ వానలతో పరిస్థితి తలకిందులైంది. వరదలనేపథ్యంలో నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలి. పాత రుణ బకాయిలను రీషెడ్యూల్‌ చేయాలి. అప్పుల కిస్తులను వసూలు చేయకుండా వాయిదా వేయాలి. వరదల నుంచి బయటపడటానికి గ్రామాల్లో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు అవసరం. గణాంకాలు సేకరించి జరిగిన నష్టాన్ని వాస్తవికంగా అంచనా వేయాలి. ఆమేరకు రైతులకు సర్కారు సాయం చేయాలి.