జర్మనీలో ఆర్థిక సంక్షోభం

– జీడీపీ 0.3 శాతానికి పతనం
బెర్లిన్‌ : ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ మాంద్యంలోకి జారుకుంది. ద్రవ్యోల్బణం కట్టడిలో విఫలం కావడంతో సంక్షోభ పరిస్థితులు చోటు చేసుకున్నాయని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ దేశ జీడీపీ ఏకంగా 0.3 శాతానికి పతనమయ్యింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5శాతం క్షీణించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధ పరిణామాల తర్వాత జర్మనీలో గ్యాస్‌ సరఫరాలు మందగించాయి. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం చూపింది. గడిచిన రెండు త్రైమాసికాల్లోనూ జర్మనీ ప్రజల కొనుగోలు శక్తి 1.2 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వం చేసే వ్యయంలోనూ 4.9 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా చోటు చేసుకోవడంతో స్టాక్‌ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జర్మనీలో ద్రవ్యోల్బణం 7.2 శాతంగా చోటు చేసుకుంది. ఇది యురోపియన్‌ దేశాల సగటు కన్నా ఎక్కువ కావడంతో ఆందోళనలు పెరిగాయి. హెచ్చు ద్రవ్యోల్బణంతో ఆహారం, దుస్తులు, ఫర్నీచర్లు కొనడం కోసం ప్రజలు ఎక్కువ వ్యయం చేయాల్సి వస్తోంది. అధిక ఇంధన ధరల వల్ల పరిశ్రమల ఉత్పత్తులకు ఆర్డర్లు తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మరింత మందగిస్తోంది. 2023 ఏడాది ఆరంభం నుంచి ధరలు అధికంగా ఉండడం వల్ల జర్మనీ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడిందని డీస్టాటిస్‌ ఏజెన్సీ విశ్లేషించింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, పారిశ్రామిక ప్రగతి మందగించడం, కఠినమైన ద్రవ్యపరపతి విధానంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు వంటివి బలహీన ఆర్థిక వ్యవస్థకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.