ఓటమి భయంతోనే ఈడీ దాడులు

ED attacks because of fear of defeat– బీజేపీపై కేరళ సీఎం విజయన్‌ విమర్శ
కన్నూర్‌ : మూడోసారి అధికారంలోకి రావడం సాధ్యం కాదనే భయంతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌తో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో శనివారం ఇడి దాడులు నిర్వహించింది. ధర్మాడం నియోజకవర్గంలో ఎల్‌డీఎఫ్‌ కుటుంబాలతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం కోలుకోలేని ప్రమాదమనే వాస్తవాన్ని దేశ ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాలతోపాటు కాకరూరిలో ఈడీతో దాడులు చేయించిందని విమర్శించారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశముందని తెలిపారు. బీజేపీయేతర అభ్యర్థి ఎవరు గెలిచినా ఫర్వాలేదని అనుకోకుండా లౌకికవాదానికి గట్టిగా కట్టుబడే వారిని, మతతత్వాన్ని ప్రతిఘటించే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ ఎప్పుడూ కచ్చితమైన వైఖరిని తీసుకోలేకపోయిందని ముఖ్యమంత్రి అన్నారు.