థాయ్‌లాండ్‌లో క్యాసినో ఘటనపై చీకోటి ప్రవీణ్‌ను ప్రశ్నించిన ఈడీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
థాయ్‌లాండ్‌లో సంచలనం రేపిన క్యాసినో గ్యాంబ్లింగ్‌పై చీకోటి ప్రవీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇటీవలన థారులాండ్‌లో భారీ ఎత్తున క్యాసినోను నిర్వహించిన ఆరోపణలపై థారు పోలీసులు చీకోటి ప్రవీణ్‌తో పాటు దాదాపు 200 మంది తెలుగువారిని అరెస్టు చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, అక్కడి నుంచి తిరిగి వచ్చిన ప్రవీణ్‌ను సోమవారం పిలిచిన ఈడీ అధికారులు థారులాండ్‌లో తాజా క్యాసినో స్కాంపై సుదీర్ఘంగా విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా కోట్ల రూపాయల డబ్బులను ఏ విధంగా అక్కడ వినియోగం చేశారు? ఆ సమయంలో పీఎంఎల్‌ఏ చట్టాన్ని ఏ విధంగా అతిక్రమించారు? అందులో మనీలాండరింగ్‌ ఏ మేరకు జరిగింది? తదితర కోణాల్లో ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా, ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలు, అందులో నుంచి విదేశాలకు ఏమైనా డబ్బు బదిలీ అయిందా? అనే కోణంలో కూడా అధికారులు విచారించినట్టు తెలిసింది. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన విచారణ అనంతరం తమకు అవసరమైతే మరోసారి పిలుస్తామని ప్రవీణ్‌ను ఈడీ అధికారులు పంపించినట్టు తెలిసింది.
నగరంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
నగరంలో ఇటీవలన ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా పాతబస్తి నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నగరంలో రహస్యంగా మకాం వేసి హిజ్‌ ఉజ్‌ తంగ్జిమ్‌ సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులతో పాటు రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దర్యాప్తును ముందుకు కొనసాగించిన ఎంపీ ఏటీసీ, రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాలు తాజాగా చాంద్రాయణగుట్ట, బార్కస్‌ల నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిని తదుపరి దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్‌ పోలీసులకు అప్పగించారు.