ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ముగిసిన ఈడీ సోదాలు

– మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీకి చెందిన రూ.4.39 కోట్లు సీజ్‌
– పీజీ సీట్లను విక్రయించి కోట్లాది రూపాయలను ఆర్జించినట్టుగా ఆధారాలు సేకరించిన అధికారులు
– దర్యాప్తు కొనసాగుతున్నట్టు వెల్లడించిన ఈడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో పీజీ మెడికల్‌ కాలేజీ సీట్లను బ్లాక్‌ చేసి అమ్ముకున్న స్కామ్‌లో కోట్లాది రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఈడీ అధికారుల సోదాల్లో తేలింది. అదే సమయంలో మల్లారెడ్డి మెడికల్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీకి చెందిన రూ. 4.39 కోట్లను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ స్కాంకు సంబంధించి రాష్ట్రంలోని కొన్ని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలకు చెందిన 16 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించినట్టు ఈడీ అధికారులు గురువారం వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్‌ చేసి కోట్ల రూపాయలలో యాజమాన్యాలు అమ్ముకున్నట్టు 2023లో వరంగల్‌లోని మట్వాడా పోలీసు స్టేషన్‌లో కాళోజీ నారాయణ రావు మెడికల్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. అంతేగాక, వారి స్వంత విచారణలో మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీతో పాటు ఐదు ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో పీజీ మెడికల్‌ సీట్లను ఒక కోటి నుంచి 2 కోట్ల రూపాయలకు విద్యార్థులకు అమ్ముకున్నట్టు తేల్చారు. దీని ద్వారా సదరు కాలేజీల యాజమాన్యాలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చి ఈడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును చేపట్టారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రంలోని తొమ్మిది ప్రయివేటు మెడికల్‌ కాలేజీలలో ఆకస్మిక సోదాలను నిర్వహించారు. ముఖ్యంగా, పీజీ మెడికల్‌ సీట్లను విద్యార్థులకు కేటాయింపులలో యాజమాన్యాలు పలు అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ముఖ్యంగా, పీజీ సీట్ల కోసం నిర్వహించే పరీక్షలో మెరిట్‌ సాధించిన విద్యార్థులను కాదని కొన్ని సీట్లను బ్లాక్‌ చేసి వాటిని మేనేజ్‌మెంట్‌ కోటాలో విద్యార్థులకు కేటాయించటానికి కాళోజీ మెడికల్‌ యూనివర్సిటీ నుంచి అనుమతులున్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించి సీట్లను అమ్ముకున్నారని ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. అంతేగాక, ఈ సీట్లను ఖరీదు చేసిన విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించలేదంటూ వాటిపై జరిమానాలు విధించి వసూలు చేసినట్టు ఈడీ అధికారుల దృష్టికి వచ్చింది. మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీలో సోదాల సందర్భంగా రూ.1.40 కోట్ల మేరకు లెక్క పత్రాలు లేని డబ్బులు ఈడీ అధికారులకు లభించాయి. అలాగే, ఈ కాలేజీకి చెందిన బ్యాంకు ఖాతాలో రూ.2.89 కోట్లను కూడా ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. అలాగే, ఇతర కాలేజీలకు సంబంధించిన పీజీ మెడికల్‌ సీట్ల కేటాయింపులు, మేనేజ్‌మెంట్‌ కోటాలోని సీట్ల విక్రయాలకు సంబంధించి వేల కోట్లలోనే వ్యవహారాలు సాగినట్టు ఈడీ అధికారుల దృష్టికి వచ్చింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల పత్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ఈ వ్యవహారాల్లో మనీలాండరింగ్‌ చోటు చేసుకున్నదనీ, ఆ కోణంలో దర్యాప్తును సాగిస్తున్నామని చెప్పారు.