– టీచర్ల ఖాళీ భర్తీ, కనీస సౌకర్యాలు లేవ్..
– ప్రశ్నించే ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఉ.పా కేసులు ఎత్తేయాలి : ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యారంగాన్ని ధ్వంసం చేసి విద్యాదినోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని, ప్రశ్నించే ఉపాధ్యాయులు, విద్యార్థులపై పెట్టిన ఉపా కేసులను ఎత్తేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని, కామన్ విద్యా విధానం నా కల అని, కలెక్టర్ పిల్లలైనా రిక్షా వాళ్ల పిల్లలైనా ఒకే బడిలో చదువుకోవాలని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా విద్యారంగాన్ని ధ్వంసం చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో 26,62 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణ లోపించి, మౌలిక సదుపాయాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్నారు. దాదాపు 24 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత సంవత్సరం కనీసం విద్యావాలంటీర్లను కూడా నియమించలేదని అన్నారు 33 జిల్లాల్లో 26 జిల్లాలకు డీఈవోలు లేరని, 67 మండలాల్లో 590 మండలాలకు ఎంఈఓలు లేరని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది డైట్ కాలేజీలు ఉంటే 6 కాలేజీలకు ప్రిన్సిపాళ్లు లేరని, 90 శాతం ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి టీచర్‌లు కూడా లేరని తెలిపారు. 7500 స్కూళ్లకు ఒకరే టీచర్ ఉన్నారని వివరించారు. మన ఊరు -మనబడి పేరు కింద కేటాయించిన రూ. 7289 కోట్లలో రూ.469 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ చక్రధర్‌రావు మాట్లాడుతూ.. 2014లో విద్యారంగానికి బడ్జెట్లో 11 శాతం నిధులు కేటాయించగా.. ఇప్పుడు ఆరు శాతానికి తగ్గించిందన్నారు. విద్యారంగానికి కనీసం నిధులు 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి, సీనియర్ నాయకులు ఎంఎన్.క్రిష్టప్ప, ప్రోగ్రెసీవ్ యూత్‌లీగ్ రాష్ట్ర అధ్యక్షులు కాశీనాథ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, కార్యదర్శి ఆజాద్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, పీడీఎస్‌యూ(వి) అధ్యక్షులు మహేష్, కార్యదర్శి విజరు పీవైఎల్ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.