విద్య ప్రతి విద్యార్థి హక్కు

– స్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణ
– ముగిసిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర
భీమవరం : విద్య అనేది ప్రతి విద్యార్ధికీ జన్మహక్కుగా ఉండాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణ అన్నారు. అయితే, నేడు దేశంలో అటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో విద్యారంగ అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యాలయాల్లో సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 11న నరసాపురంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రారంభించిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌యాత్ర గురువారం భీమవరంలో ముగిసింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పి.వాసు అధ్యక్షతన లాంచీలరేవు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో నితీష్‌ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఒ 77ను తీసుకొచ్చి పేద విద్యార్థులందరికీ ఉన్నత విద్యను దూరం చేసిందన్నారు. 25 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సి నిర్వహించి భర్తీ చేపడతామని ఇచ్చిన హామీని జగన్మోహన్‌రెడ్డి విస్మరించారని తెలిపారు. పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం జిఒ 117 ద్వారా మూసివేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, జిఒ 77 రద్దు చేయాలని, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సభలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.ధనుష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాన్‌ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.