రాజకీయ చైతన్యాన్ని నింపేది విద్యనే

Krupaskaya.కృపస్కయా… సోవియట్‌ యూనియన్‌లో విద్యా వ్యాప్తికోసం ఎంతో కృషి చేసింది. కార్మికులకు అక్షరాలు నేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టింది. విద్యనే వారిలో రాజకీయ చైతన్యం నింపే ఆయుధం అని విశ్వసించింది. అలాగే మహిళా హక్కుల కోసం అహర్నిశలూ తపించింది. గొప్ప విప్లవకారుడు లెనిన్‌కు భార్యగానే గాక అతని రచనలు ప్రపంచం ముందుకు వచ్చేందుకు నిరంతరం శ్రమించింది. కమ్యూనిస్టు పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించిన ఆ మహిళా నాయకురాలి పరిచయం రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేటి మానవిలో…
కృపస్కయా సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో కులీన కుటుంబంలో జన్మించింది. ఆమెలో మొదటి నుండి పేదల జీవితాలను మెరుగుపరచాలనే బలమైన కోరిక ఉండేది. తర్వాత కాలంలో మార్క్సిజంలోకి అడుగుపెట్టింది. 1894లో మార్క్సిస్ట్‌ చర్చా బృందంలో లెనిన్‌ను కలుసుకుంది. విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తూ 1896లో ఇద్దరూ అరెస్టయ్యారు. లెనిన్‌ సైబీరియాకు బహిష్కరించబడిన తర్వాత కృపస్కయా 1898లో ఆయన్ని వివాహం చేసుకుంది. 1905 విప్లవంలో పాల్గొనడానికి రష్యాకు తిరిగి వచ్చే ముందు వారిద్దరూ కొంత కాలం మ్యూనిచ్‌, లండన్‌లో నివసించారు. 1917 విప్లవం తర్వాత కృపస్కయా రాజకీయాలో కీలకపాత్ర పోషించారు. 1924లో కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1929 నుండి 1939 వరకు డిప్యూటీ ఎడ్యుకేషన్‌ కమీషనర్‌, సోవియట్‌ అభివృద్ధితో సహా సోవియట్‌ విద్యా వ్యవస్థపై బలమైన ప్రభావం చూపించారు. 1939లో ఆమె మాస్కోలో మరణించింది.

దుర్భర జీవితాలకు వ్యతిరేకంగా
కృపస్కయా పుట్టింది ఉన్నత కుటుంబంలోనే. కానీ ఆమె పుట్టేనాటికి వారి పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయి ఉంది. ఆమె తండ్రి కాన్‌స్టాంటిన్‌ ఇగ్నాటీవిచ్‌ క్రుప్‌స్కీ, రష్యన్‌ సైనిక అధికారి. మంచి పేరుతున్న వ్యక్తి. తర్వాత కాలంలో అతనికి విప్లవకారులతో పరిచయాలను ఉన్నాయనే అనుమానంతో ఎక్కడా మని దొరక్కుండా చేశారు. తల్లి యెలిజవేటా వాసిలీవ్నా టిస్ట్రోవా, భూమిలేని రష్యన్‌ ప్రభువుల కుమార్తె. ఆమె తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. అప్పట్లో ఆమె రష్యాలో మహిళలకు అందుబాటులో ఉన్న అత్యున్నత అధికారిక విద్య బెస్టుజేవ్‌ కోర్సులలో చేరింది. డిగ్రీని సంపాదించిన తర్వాత వివాహం చేసుకునే వరకు ఉన్నత కుటుంబాలకు గవర్నెస్‌గా పనిచేసింది. బాగా చదువుకున్న, కులీన వంశానికి చెందిన తల్లిదండ్రుల ప్రభావం వల్లనో ఏమో కృపస్కయా అనేక రకాల సైద్ధాంతిక విషయాలపై అవగాహన పెంచుకుంది. చిన్నతనం నుండే తన చుట్టూ ఉన్న దుర్భర జీవితాలకు వ్యతిరేకంగా స్పందిస్తుండేది.
విద్యపై ఆసక్తితో…
తండ్రి మరణంతో కృపస్కాయా తన తల్లితో పాటు కుటుంబ పోషణ కోసం టీచర్‌గా పని చేసింది. చిన్నప్పటి నుండి ఆమెకు విద్యంటే ఆసక్తి. పాఠాలు చెబుతూ ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించేది. ఆమె మొదటి నుండి టాల్‌స్టారు రచనలను బాగా అధ్యయనం చేసేది. ఆ ప్రభావం ఆమెపై పడింది. ఆ ప్రభావంతోనే ఆమె ఎప్పుడూ నిరాడంబరంగా ఉండేది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చేది. అందుకోసం అనేక చర్చల్లో పాల్గొనేది. మొదట ఆమెకు మార్క్స్‌ సిద్ధాంతం పరిచమయింది. ఇది తన ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు సరైన మార్గంగా గుర్తించింది. అందుకే మార్క్సిస్ట్‌ తత్వశాస్త్ర లోతైన అధ్యయనాన్ని ప్రారంభించింది. అప్పట్లో ఈ పుస్తకాలను రష్యన్‌ ప్రభుత్వం నిషేధించడంతో అధ్యయనం చాలా కష్టంగా మారింది. అందుకే సేకరించి భూగర్భ లైబ్రరీలలో ఉంచేవారు. 1890లో ఆమె ఇంజనీర్‌ రాబర్ట్‌ క్లాసన్‌ నిర్వహించిన మార్క్సిస్ట్‌ సర్కిల్‌లో చేరింది. తర్వాత యువ కార్మికుల కోసం నడిచే సండే స్కూల్లో పని చేసింది.
లెనిన్‌తో వివాహం
కృపస్కయా మొదటిసారిగా లెనిన్‌ను ఫిబ్రవరి 1894లో ఓ చర్చా సమూహంలో కలుసుకుంది. అక్కడ అతని వ్యక్తిత్వం కన్నా ప్రసంగం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అక్టోబరు 1896లో లెనిన్‌ అరెస్టయిన చాలా నెలల తర్వాత ఆమె కూడా అరెస్టయ్యింది. ఆమెను కొంతకాలం పీటర్‌, పాల్‌ కోటలో నిర్బంధించారు. అయితే అక్కడ ఓ మహిళ తనను తాను కాల్చుకుని మరణించడంతో కృపస్కయను కూడా విడుదల చేశారు. ఆమె యుఫాలో మూడేండ్లు బహిష్కరణకు గురయ్యింది. బహిష్కరణకు ముందు తన తల్లి ద్వారా ఆమెకు లెనిన్‌ నుండి ఓ ఉత్తరం అందింది. అతను ఉంటున్న ప్రవాస ప్రదేశానికి ఆమెను అనుమతించే లేఖ అది. ఆమెకు లెనిన్‌తో పాటు వెళ్లేందుకు అనుమతి దొరికింది. అయితే వచ్చిన వెంటనే ఇద్దరూ వివాహం చేసుకోవాలని తల్లి షరతు పెట్టింది. మే 1898లో కృపస్కయా లెనిన్‌న్ని వివాహం చేసుకుంది. అప్పటి నుండి లెనిన్‌ రచనలను ఆమె అనువాదం చేసేది.
అనారోగ్యం వెంటాడినా…
కృపస్కయా గ్రేవ్స్‌ వ్యాధి బారిన పడింది. ఇది థైరాయిడ్‌ గ్రంధిని ప్రభావితం చేస్తుంది. దీని వలన కళ్లు ఉబ్బి, మెడ బిగుసుకుపోతుంది. అంతేకాదు ఋతు చక్రానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇలా ఎన్ని అనారోగ్య సమస్యలు వెంటాడినా తన రాజకీయ లక్ష్యాన్ని మాత్రం విడనాడలేదు. విడుదలైన తర్వాత లెనిన్‌ యూరప్‌ వెళ్లి మ్యూనిచ్‌ వెళ్ళాడు. ఆమె కూడా విడుదలై అతని వద్దకు వెళ్ళింది. తర్వాత ఇద్దరూ కలిసి లండన్‌కు వెళ్లారు. కృపస్కయా లెనిన్‌తో తన జీవితపు జ్ఞాపకాలను 1930లో ‘మెమోరీస్‌ ఆఫ్‌ లెనిన్‌’ అని రాసుకుంది.
రాజకీయ జీవితం
1903 నుండి ఆమె రష్యన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ లేబర్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన బోల్షెవిక్‌ కార్యకర్తగా ఉండేది. అప్పట్లో లెనిన్‌ నడిపిస్తున్న ఇస్క్రా వార్తాపత్రిక కోసం ఆమె ఎంతో కృషి చేసింది. 1905లో ఆమె రష్యాకు తిరిగి వచ్చింది. 1905 విప్లవం విఫలమైన తర్వాత మళ్లీ వెళ్లిపోయి ఫ్రాన్స్‌లో కొన్నేండ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1917లో రష్యన్‌ విప్లవం తర్వాత ఆమె పీపుల్స్‌ కమీసర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అనాటోలీ లునాచర్స్కీకి డిప్యూటీగా నియమితులయ్యింది. అక్కడ ఆమె వయోజన విద్యా విభాగానికి బాధ్యతలు స్వీకరించారు. 1920లో విద్యా కమిటీకి అధ్యక్షురాలై 1929 నుండి 1939 వరకు డిప్యూటీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ (ప్రభుత్వ మంత్రి)గా పని చేసింది. సోవియట్‌ విద్యా వ్యవస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. సోవియట్‌ లైబ్రేరియన్‌షిప్‌ అభివృద్ధిలో కూడా భాగస్వామిగా ఉంది. 1924లో సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యురాలిగా, 1927లో దాని కంట్రోల్‌ కమిషన్‌ సభ్యురాలిగా, 1931లో సుప్రీం సోవియట్‌ సభ్యురాలిగా ఉంది.
నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్‌
కృపస్కయా నిబద్ధత కలిగిన మార్క్సిస్ట్‌. ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికి అహర్నిశలూ కృషి చేసింది. అలాగే మహిళా కార్మికులను విద్యా వంతులుగా చేయడంలో, రాజకీయంగా వారిని చైతన్య పరచడంలో ముఖ్య పాత్ర పోషించారు. మహిళా హక్కుల కోసం జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. జనవరి 1924లో లెనిన్‌ మరణానంతరం కూడా ఆమె పార్టీలో కొనసాగుతూ పార్టీలో జరుగుతున్న అంతర్గత పొరపాట్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండేది. కృపస్కయా 27 ఫిబ్రవరి 1939న మాస్కోలో మరణించింది. ఆమె డెబ్బైవ పుట్టినరోజు తర్వాత రోజు ఆమెను క్రెమ్లిన్‌ వాల్‌ నెక్రోపోలిస్‌లో ఖననం చేశారు.
సోవియట్‌ యూనియన్‌లో విద్య
విప్లవానికి ముందు ఆమె ఉద్యోగులకు ఐదేండ్ల పాటు సాయంత్రం తరగతులను బోధించింది. చదవడం, రాయడంతో పాటు వారికి లెక్కలు నేర్పించేది. ఈ ప్రాంతంలో దాదాపు 30,000 మంది ఫ్యాక్టరీ కార్మికులు మెరుగైన వేతనాల కోసం సమ్మె చేయడానికి అవసరమైన చైతన్యాన్ని నింపారు. విప్లవం తర్వాత కూడా ఆమె ‘యువత సంస్థ – విద్య యొక్క సమస్యలపై’ దృష్టి సారించింది. కార్మికులు విద్యా వంతులుగా మారడానికి వారికి పుస్తకాలు అవసరమని ఆమె గుర్తించారు. కార్మికులకు అలాంటి పుస్తకాలు అందుబాటులో ఉండచంలో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. సోషలిస్ట్‌ రాజకీయ విలువలు పెంపొందేందుకు విద్య చాలా అవసరమని ఆమె విశ్వసించింది.