గౌడ కులాన్ని బీసీబంధు పథకంలో చేర్చించేందుకు కృషి…

-ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
నవతెలంగాణ -డిచ్ పల్లి.
సీఎం కేసీఆర్ తో మాట్లాడి గౌడ కులాన్ని బీసీబంధు పథకంలో చేర్చించేందుకు తనవంతు కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ హామీ ఇచ్చారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్ జి గార్డెన్ లోని నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఏకైక బీసీ నాయకుడిని తానేనని తనకు అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో గౌడ కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చెట్టు పన్ను పేరుతో గౌడ కులస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చెట్టు పన్ను ను రద్దు చేశారని తెలిపారు. ప్రస్తుతం గౌడ కులస్తులు ఎంతో సంతోషంగా వారి కుల వృత్తిని చేసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ప్రజలకు కల్తీలేని కల్లు అందించడానికి ప్రభుత్వం ఈత వనాలు, తాటి వనాలు పెంపకం ప్రోత్సహిస్తోంద న్నారు. సర్వాయి పాపన్నగౌడ్ రజాకార్లను ఎదిరించి గోల్కొండ పై జెండా ఎగురవేశారని తెలిపారు. తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ‘ సీఎం కేసీఆర్ తో మాట్లాడి వీజీగౌడ్ కు ఎమ్మెల్సీ వచ్చేలా ప్రయత్నిస్తానని తెలిపారు. గతంలో గౌడు తాటి చెట్టుపై నుంచి పడి మరణిస్తే రూ.2లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షలు అందజేస్తుందన్నారు. డిచ్పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉన్న దృష్ట్యా బీసీ హాస్టల్ నిర్మాణం కోసం రూ. కోటి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ కొత్తగా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని 90 లక్షల మందికి  రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తోందన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రూరల్ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిత్యం పని చేసే బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 30న జరిగే ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఫోటో కన్పిస్తుందని, ఫోటోను చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, గౌడ సంఘం నాయకులు రాజాగౌడ్, సురేందర్ గౌడ్, జయసింహగౌడ్, శ్యాంసుందర్ గౌడ్, పర్మాగౌడ్, నర్సాగౌడ్, నాలాగౌడ్, గంగాదర్ గౌడ్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తో పాటు ఏడు మండలాల గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.