ఓట్ల నమోదులో ప్రయాస

Efforts to register votes– దొంగ ఓట్ల నమోదులో ‘అధికారం’
– సవరణకు సహకరించని అధికారులు
– యువకుల ఓట్ల నమోదులో నిర్లక్ష్యం
– చెత్త బుట్టలో ఫామ్‌-6 దరఖాస్తులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా కీలకం. అలాంటి ఓటు హక్కును పొందేందుకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలగాను 18 ఏండ్లు నిండిన యువకులతోపాటు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి, జాబితాలో తప్పులు, చేర్పులు, మార్పులు సవరణ చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. అయితే, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినప్పటికీ చాలా చోట్ల అధికారుల తీరు వల్ల కొత్తగా ఓట్లు నమోదు కావడం లేదు. అధికార పార్టీ నాయకులు ఇచ్చిన దరఖాస్తులను మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇతరులు, సామాన్య ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను నిరాకరిస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. వివాహం చేసుకున్న వారి ఓట్లు ఆయా నియోజకవర్గాల్లో నమోదు కావడం లేదు. కానీ అధికార పార్టీ నాయకులు సొంతంగా ఆన్‌లైన్‌ చేయించిన దరఖాస్తులకు మాత్రం ఎలాంటి విచారణా చేపట్టకుండానే ఆమోదం తెలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓటు సవరణ పై అధికారుల నిర్లక్ష్యం
ఫారం 8 ద్వారా ఓటరు జాబితాలో సవరణ చేసుకోవాలి. పేర్లు, ఇంటి నెంబర్లు, ఫొటోలు, ఇతర వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంది. అయితే, సవరణ కోసం చేసుకున్న దరఖాస్తులను అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే బిఎల్వోలు (పోలింగ్‌ బూత్‌స్థాయి అధికారులు) దరఖాస్తులు పరిశీలించకుండా.. సవరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చనిపోయిన వారి ఓట్లు, వివాహం చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించడం.. బదిలీ చేయడానికి ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దానికిగాను ఫామ్‌ నెంబర్‌ 7 ఇవ్వాలని సూచించింది. వాస్తవానికి ఆయా పోలింగ్‌ పరిధిలో విధులు నిర్వహించే బిఎల్‌ఓల వద్ద ఆ పోలింగ్‌ కేంద్రం పరిధిలోని చనిపోయిన వారి వివరాలు స్పష్టంగా ఉంటాయి. బిఎల్వోలు అంగన్వాడీ ఉద్యోగులు కావడం వల్ల మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంలో అంగన్వాడీ టీచర్లే కీలకంగా వ్యవహరిస్తారు. కానీ ఓటర్‌ జాబితాలో చనిపోయిన వారి ఓటు తొలగించాలంటే కుటుంబ సభ్యుల ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అధికారులు నిబంధన పెట్టడంతో ముందుకు పడటం లేదు. దీంతో ఓటర్‌ జాబితాలో చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉంటున్నాయి.
ఫారం 6, 8 ను తీసుకోని ఆధికారులు
18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటు హక్కును విధిగా నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ పిలుపునిచ్చింది. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని వార్డుల్లో వలస వచ్చిన వారి ఓట్లను కూడా నమోదు చేసుకోవాలని సూచించింది. దీనికి ఫారం నెంబర్‌ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. యువకుల ఓట్లకు తప్పనిసరిగా ఆధార్‌ కార్డుతోపాటు వయసు ధ్రువీకరించే సర్టిఫికెట్‌ జత చేయాలని పేర్కొన్నారు. 20 సంవత్సరాలు పైబడి ఉన్న వారి దరఖాస్తులకు ధ్రువీకరణ పత్రం లేకపోయినా సరిపోతుంది. కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్ని కల అధికారులు క్షేత్రస్థాయిలో విచా రణ జరపకుండానే రిజ ెక్ట్‌ చేస్తున్నారు. ఈనెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 19వ తేదీ వరకు నూతన ఓటరు దరఖాస్తు చేసుకునే గడువు ఉన్నది. ప్రస్తుతం బిఎల్‌ఓలు (అంగన్వాడీలు) సమ్మెలో ఉండటం వల్ల దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఎన్నికల అధికారులు కూడా కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. పలుకుబడిగల వారు ఒత్తిడి చేస్తే దరఖాస్తు తీసుకుంటున్నారు తప్ప వాటిని ఆన్‌లైన్‌ చేయడం లేదు. 20 సంవత్సరాలు పైబడిన వారు ఓటు కోసం ఫామ్‌ నెంబరు 8 ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ పరిగణలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎక్కడ ఉన్నారో అక్కడి ఎన్నికల అధికారి నుంచి అక్కడ ఓటు తొలగిస్తున్నట్టు ధృవీకరణ పత్రం తీసుకొస్తే తప్ప ఇక్కడ నమోదు చేసుకో బోమని తేల్చి చెప్తున్నారు. చాలామంది వీటిని భరించలేక దరఖాస్తు చేయ డమే మా నేస్తు న్నారని సమాచారం.
ఆధార్‌ లింకు మరిచిన అధికారులు
దొంగ ఓట్ల ను తొలగించాలని ఎన్నికల కమిషన్‌ ఓటుకు ఆధార్‌ లింకు చేయాలని నిబంధన పెట్టింది. బిఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల ఆధార్‌ నెంబర్‌ను సేకరించి లింకు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 90 శాతం ఓట్లను ఆధార్‌ లింక్‌ చేసినట్టు సమాచారం. మిర్యాలగూడ నియోజవర్గంలో 95శాతం ఓటుకు ఆధార్‌ లింక్‌ చేశారు. మిగిలిన శాతం పూర్తి చేసి 100శాతం లక్ష్యం సాధించాలని ఉన్నత అధికారులు పదేపదే సూచిస్తున్నప్పటికీ కింది స్థాయి అధికారులు అమలు చేయడం లేదు. ఆధార్‌ లింకు లేనివి.. మిగిలిన ఓట్లు అన్ని దొంగ ఓట్లుగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
అందుకే ఆధార్‌ లింక్‌ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ శివారు ప్రాంతాల్లో గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఓట్లకే ఇప్పుడు ఆధార్‌ లింక్‌ చేయడం లేదని ప్రతిపక్ష పార్టీలు బలంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా అధికార పార్టీ క్యాంపు కార్యాలయంలో అధికారుల సహకారంతో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 27, 46,402 మంది ఓటర్లు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 27 లక్షల 46,402 మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈనెల 19వ తేదీ వరకు ఓటుకు నమోదుకు గడువు ఉండటం వల్ల కొత్త ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరగనుంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 58,584 కొత్త ఓట్లు నమోదయ్యాయి. గతంలో పురుషులు 13 లక్షల 38,169 మంది ఉండగా ప్రస్తుతం 13 లక్షల 67,735 మందికి పెరిగారు. మహిళలు గతంలో 13 లక్షల 49,568 మంది ఉండగా 13 లక్షల 78,452 మందికి పెరిగారు. థర్డ్‌ జెండర్‌ గతంలో 81 ఉండగా 155కు పెరిగారు.
మిర్యాలగూడలో 16,012 దరఖాస్తులు
మిర్యాలగూడ నియోజవర్గంలో జులై నుంచి ఇప్పటివరకు 16,012 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నూతన ఓట్లు నమోదు చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, ఓట్ల సవరణ దరఖాస్తులున్నాయి.
3,550 దరఖాస్తులు ఆఫ్‌లైన్‌ ద్వారా, 12,455 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చాయి. ఇందులో 6851 దరఖాస్తులను అప్రూవల్‌ చేశారు. మిగిలిన దరఖాస్తులను ప్రస్తుతం విచారిస్తున్నారు. దరఖాస్తుల నమోదుకు ఈనెల 19 వరకు గడువు ఉంది. అక్టోబర్‌ 4న తుది ఓటర్‌ జాబితా విడుదల కానుంది.
పారదర్శకంగా నిర్వహిస్తున్నాం ఆర్డీఓ చెన్నయ్య
ఓటు నమోదు, సవరణ, తొలగింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. వచ్చిన దరఖాస్తులను వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం. కొత్త ఓట్లు వెంటనే ఆన్‌లైన్‌ చేసి అప్రూవల్‌ చేస్తున్నాం. ఓట్ల సవరణ కూడా వెంటనే చేపడుతున్నాం.చనిపోయిన వారి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను పరిశీలించి తొలగిస్తున్నాం. ఈనెల 19 వరకు కొత్త ఓట్ల కోసం నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 4న తుది ఓట జాబితా విడుదల చేస్తాం.
నియోజకవర్గాల వారీగా ఓటర్లు
పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మిర్యాలగూడ 1,08,047 110629 20 2,18,696
సాగర్‌ 1,10,571 112839 21 2,23,43
దేవరకొండ 1,17,363 116037 5 2,31,215
నల్గొండ 1,12,994 117097 53 230144
నకిరేకల్‌ 1,18,990 118819 04 237813
భువనగిరి 1,03,741 103092 0 206833
ఆలేరు. 111,336 109294 08 220638
హుజర్నగర్‌ 1,16,598 120720 07 237325
కోదాడ. 1,13,333 117062 11 230406
సూర్యాపేట 1,11,667 114910 04 226571
తుంగతుర్తి 1,21,058 119039 07 240104