జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల సమరం

Election campaign in Jammu and Kashmir– కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్‌లో షెడ్యూల్‌ విడుదల
–  అక్టోబర్‌ 4న పోలింగ్‌..
లెహ్  : కేంద్రపాలిత ప్రాంతం లద్దాక్‌లో అక్టోబర్‌ 4న ఎన్నికలు జరగనున్నాయి. ఈమేరకు లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఎహెచ్‌డీసీ), లెహ్/ కార్గిల్‌ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విభాగం, యూటీ లద్దాక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రెటరీ యతీంద్ర ఎం. మరాల్కర్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం… సెప్టెంబర్‌ 9న నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్‌ 16. నామినేషన్లను పరిశీలన సెప్టెంబర్‌ 18న నిర్వహించనున్నట్టు తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్‌ 20 చివరి తేదీ కాగా, అక్టోబర్‌ 4 ఓటింగ్‌ను నిర్వహిస్తారు. అక్టోబర్‌ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌ పేర్కొంది.
నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని.. నోటిఫికేషన్‌లో పేర్కొంది. కార్గిల్‌ జిల్లా మొత్తం కూడా వర్తిస్తుందని పేర్కొంది.నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అభ్యర్థులు నాగలిని ఎన్నికల గుర్తుగా వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలోని పరిపాలక యంత్రాంగం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎన్‌సీ అభ్యర్థులు తమ పార్టీ గుర్తును కొనసాగించవచ్చని తెలిపింది. యూటీ పరిపాలక యంత్రాంగాన్ని చీవాట్లు పెట్టడంతో పాటు లక్షరూపాయల జరిమానా విధించింది. అలాగే ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ.. తాజా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన వారం రోజుల లోపు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లద్దాక్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో భాగమైన కార్గిల్‌లో 26 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఓటింగ్‌ కోసం అధికారులు 278 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టికల్‌ 370 , 35ఎను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం కార్గిల్‌లో అక్టోబర్‌లో పోలింగ్‌ జరగనున్నది. చివరి సారిగా ఎల్‌ఎహెచ్‌డీసీ -కార్గిల్‌లో 2018లో ఎన్నికలు జరిగాయి. అభివృద్ధి, పరిపాలన, పర్వత ప్రాంతాలపై స్థానిక ప్రాతినిథ్యం వహించనున్న 30 మంది సభ్యులతో కూడిన పాలకమండలి కోసం 89 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.