రోడ్డు కోసం..ఎన్నిక బహిష్కరణాస్త్రం..!

– కుండిషేకుగూడ వాసుల ఏకగ్రీవ తీర్మానం
– రోడ్డు కోసమే ఏడాదిన్నర కిందట 9 రోజులు పోరాటం
– హామీ పొందినా కనిపించని ఫలితం
– కాగితాలకే పరిమితమైన అధికారుల ప్రతిపాదనలు
అదో మారుమూల ఆదివాసీ పల్లె. అడవి తల్లి ఒడిలో ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ పల్లెకు రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసర పరిస్థితిలో అస్పత్రికి వెళ్లాలన్నా అవస్థలు పడాల్సిందే. ఈ దారి తిప్పలు ఎన్నాండ్లు భరించాలని భావించిన ఆ గ్రామస్తులు పోరాటానికి నడుం బిగించారు. సీపీఐ(ఎం) అండతో ఏడాదిన్నర కిందట గ్రామం నుంచి పిల్లాపాపలతో కాలినడకన కలెక్టరేట్‌కు వచ్చి తొమ్మిది రోజులపాటు నిరవధిక దీక్ష కూడా చేశారు. ఆందోళనకు దిగొచ్చిన అధికారులు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి.. నీటి సమస్యను మాత్రమే తీర్చారు. రోడ్డు నిర్మాణాన్ని విస్మరించారు. అధికారుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తమ సమస్యను తీర్చకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడ మండలం కుండిషేకుగూడ వాసుల దీనస్థితిపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి (ఎమ్‌.సురేష్‌)
ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల గాదిగూడ మండలంలోని కుండిషేకుగూడ వాసులు ఇప్పటికీ రోడ్డు సౌకర్యానికి నోచుకోలేదు. కనీసం తాగునీరు, అంగన్‌వాడీ భవనంతోపాటు ఆ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నారు. గాదిగూడ మండల కేంద్రం నుంచి కుండిషేకుగూడ వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. ఈ గ్రామంతోపాటు చిన్నకుండి, మారుతిగూడ, కొలాంగూడ పల్లెలకు సైతం ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సి ఉంటుంది. మండలంలోని పిప్రి నుంచి తారురోడ్డు ఉండగా.. అక్కడి నుంచి కుండిషేకుగూడ వరకు అటవీ ప్రాంతం గుండా ఏడు కిలోమీటర్ల వరకు మొరం రోడ్డు ఉంది. అది కూడా గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నదే. మట్టి రోడ్డు కావడంతో వర్షాకాలంలో నీటి ప్రవాహంతో పలుచోట్ల తెగిపోతుండటంతో ఈ దారి నుంచి వెళ్లడం కష్టంగా మారుతుంది. బురదమయంగా ఉండటంతో కాలినడకన కూడా వెళ్లడం కష్టంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో అస్పత్రికి వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గర్భిణుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దారిని బాగు చేయాలని ఏండ్ల నుంచి అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. గ్రామానికి బీటీ రోడ్డు, తాగునీరు, అంగన్‌వాడీ, అంతర్గత రోడ్లు తదితర వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గతంలో నిరసన చేపట్టారు. ఏడాదిన్నర కిందట ఫిబ్రవరిలో గ్రామం నుంచి పిల్లాపాపలతో ఊరంతా కాలినడకన కలెక్టరేట్‌కు కదిలొచ్చింది. అక్కడే తొమ్మిది రోజులపాటు వంటావార్పు చేసుకుని నిద్రిస్తూ నిరసన తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపి అండగా నిలిచాయి. పోరాటం ఉధృతమైన క్రమంలో దిగొచ్చిన ఐటీడీఏ అధికారులు హామీ ఇచ్చి.. కేవలం తాగునీటి సమస్యను పరిష్కరించారు. పిప్రి నుంచి కుండిషేకుగూడ వరకు ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మిస్తామని హామీనిచ్చారు. ఇందుకు రూ.7కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని భరోసా ఇచ్చారు. త్రీఫేజ్‌ కరెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు. కానీ ఏడాదిన్నర గడిచినా ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు
పిప్రి నుంచి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఏండ్ల నుంచి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రోడ్డు కోసం ఇది వరకు పోరాటం చేయగా బీటీ రోడ్డు నిర్మిస్తామని అధికారులు హామీనిచ్చారు. ఇప్పటి వరకు నిర్మించలేదు. అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
– సుంగు- కుండిషేకుగూడ
ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం
పిప్రి నుంచి మా గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొరం, మట్టి రోడ్డు మాత్రమే ఉండటంతో వర్షాకాలంలో గ్రామం నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. ఝరిలోని పీహెచ్‌సీకి వెళ్లాలంటే బాలింతలు, గర్భిణీలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇందుకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించడమే మార్గమని నిర్ణయం తీసుకున్నాం.
– దౌలత్‌రావు, పటేల్‌- కుండిషేకుగూడ