వేసవి సెలవుల్లో ఇంటర్‌ తరగతులు…

– కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో నిబంధనలు బేఖాతర్‌
– నారాయణ కాలేజీ యాజమాన్యం మరింత దూకుడు
– ఫస్టియర్‌ విద్యార్థులకూ బోధన షురూ
– చోద్యం చూస్తున్న ఇంటర్‌ బోర్డు
– గుర్తింపు రద్దు చేయాల్సిందే : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. వేసవి సెలవుల్లో ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహించొద్దంటూ ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కానీ వాటిని కార్పొరేట్‌ విద్యాసంస్థలు బేఖాతర్‌ చేస్తున్నాయి. వేసవి సెలవుల్లో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లోని కాలేజీల్లో తరగతులు సాగుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో కాలేజీ నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నది. అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నది. వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ గడపాల్సిన విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నది. మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ నారాయణ విద్యాసంస్థలో అడ్మిషన్ల ప్రక్రియ గతేడాది డిసెంబర్‌ నుంచే ప్రారంభమైంది. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ విద్యార్థులకు గాలం వేస్తున్నది. ముందే సీటు రిజర్వ్‌ చేసుకుంటే రాయితీలు కల్పిస్తామంటూ పీఆర్వోల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నది. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్లను ముందే రిజర్వ్‌ చేసుకుంటున్నారు. అయితే పదో తరగతి ఫలితాలు రాకముందు నుంచే ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. గతంలోనూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలపై ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకున్నది. అయినా ఏటా నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహించడం షరామామూలుగా సాగుతున్నది. బోర్డు నిబంధనలను, ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా ముందుకు సాగుతుండడం గమనార్హం. నిబంధనలను ఉల్లంఘించే కార్పొరేట్‌ కాలేజీలపై చర్యలు తీసుకోకుండా ఇంటర్‌ బోర్డు చోద్యం చూస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు ఆశపడి ఇలా చేస్తున్నదంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అటకెక్కిన కార్పొరేట్‌ కాలేజీల నియంత్రణ
తెలంగాణ వస్తే నారాయణ వంటి కార్పొరేట్‌ కాలేజీలను నియంత్రిస్తామని ఉద్యమ నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పలుసార్లు ప్రకటించారు. దీంతో ఫీజులు తగ్గుతాయనీ, అందరికీ అందుబాటులో ఇంటర్‌ విద్య ఉంటుందని ఆశించారు. అధికారంలోకి వచ్చాక దాని సంగతినే ప్రభుత్వం మరిచిపోయిందంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కార్పొరేట్‌ కాలేజీల నియంత్రణ అటకెక్కింది. వాటి విద్యావ్యాపారం విచ్చలవిడిగా సాగుతుండడమే ఇందుకు నిదర్శనం. విద్యాసంస్థలు కూడా విస్తరించాయి. ఇంకోవైపు కార్పొరేట్‌ విద్యాసంస్థలు పాఠశాల విద్యారంగంలోకి వచ్చాయి. దీంతో నర్సరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. అంటే కార్పొరేట్‌ కాలేజీల విద్యావ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతున్నది. కానీ అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేట్‌ కాలేజీలకే ప్రభుత్వం అండగా ఉంటున్నదన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి ఏపీ తరహాలోనే తెలంగాణలో ఇంటర్‌ బోర్డును కార్పొరేట్‌ కాలేజీలు శాసిస్తున్నాయన్న విమర్శలొస్తున్నాయి. అయినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి : అశోక్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ, రాష్ట్ర సహాయ కార్యదర్శి
వేసవికాలంలో తరగతులను నిర్వహించొద్దని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు చెప్పినా కార్పొరేట్‌ కళాశాలల్లో విచ్చలవిడిగా తరగతులు నిర్వహిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె అశోక్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థులకు నెల రోజులు సెలవులిచ్చినా తరగతులు నిర్వహించి వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయని అన్నారు. బోర్డు అధికారులకు తరగతులు నిర్వహిస్తున్నాయంటూ విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికారులు కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. అందుకే ఆ కాలేజీలపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. సోమవారం సనత్‌ నగర్‌లో తరగతులు నిర్వహిస్తున్న ఓ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి ఆ కాలేజీపై చర్యలు తీసుకుని సీజ్‌ చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించే కార్పొరేట్‌ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love